కరోనా ఎవర్ని వదిలిపెట్టడం లేదు..ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు ఎంతో గుర్తింపు ఉన్న ప్రముఖులు సైతం కరోనా కు బలైయ్యారు. తాజాగా భద్రాద్రి మాజీ ప్రధాన అర్చకులు కరోనా తో మృతి చెందారు. భద్రాద్రి దేవస్థాన తొలి ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు ఇటీవలే తీవ్ర ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా, ఆయనకు కరోనా సోకిందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో చికిత్స పొందుతూ కోటి రామకృష్ణమాచార్యులు మంగళవారం తుదిశ్వాస విడిచారు.
కాగా దేవస్థాన అర్చకత్వం కోసం భక్త రామదాసు తీసుకొచ్చిన ఐదుగురు కుటుంబాల్లో కోటి వారి కుటుంబం ఒకటి. ఈ క్రమంలో రామకృష్ణమాచార్యులు కూడా వంశపారంపర్య అర్చకుడిగా రామయ్యకు విశేష సేవలందించారు. దేవస్థానం తొలి ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత అర్చకుడిగా ఉన్న రామకృష్ణమాచార్యులు శ్రీ పాంచరాత్రగమంలో తెలుగునాట సుప్రసిద్ధ పండితులు.
రామకృష్ణమాచార్యులు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి భద్రాద్రి రామయ్య ఆత్మస్థైర్యాన్నిఇవ్వాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.