IND vs AUS : భారత్ స్పిన్ మాయాజాలం… తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆలౌట్


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నాగపూర్ లో జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న జడేజా తన విశ్వరూపం చూపించాడు. ఇక జడేజా మరియు అశ్విన్ వరుసగా వికెట్లు తీస్తూ ఆసీస్ పతనాన్ని శాసించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1) ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సిరాజ్ ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఖవాజా అవుటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే అద్భుతమైన డెలివరీతో వార్నర్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 2 పరుగలకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయిన ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. అయితే లబుషేన్, స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండానే లంచ్ వరకు ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

లంచ్ వరకు భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ ఇద్దరినీ జడ్డూ పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత ఆసీస్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. జడేజా 5 వికెట్లతో దుమ్మురేపగా, అశ్విన్ 3 వికెట్లు, షమీ మరియు సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. జడేజా బౌలింగ్ చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో పాత పద్ధతిలో ‘సర్ జడేజా’ అంటూ తెగ పోస్టులు చేస్తున్నారు. కాగా సూర్యకుమార్ యాదవ్, భరత్ ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరుపున టెస్టుల్లో ఆరంగేట్రం చేసారు.