Site icon TeluguMirchi.com

ఏపీపీఎస్సీ చైర్మన్ గా బిస్వాల్

biswal-APPSCఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నూతన చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి చిత్తరంజన్ బిస్వాల్ నియమిమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బిస్వాల్ నియామకం ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వంటి పలు కీలక పదవుల్లో పనిచేసిన బిస్వాల్ నెల క్రితం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఏపీపీఎస్సీ ప్రస్తుత చైర్పర్సన్ రేచల్ ఛటర్జీ ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు.

ఏపీపీఎస్సీ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్త ఛైర్మెన్ ఎంపిక ఉత్కంఠ కలిగించింది. రేచల్ ఛటర్జీ స్థానంలో ఛైర్మెన్ ఎంపిక కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ సహా పలువురు అధికారుల పేర్లను పరిశీలించారు. మిన్నీ మాథ్యూను సీఎన్ గా కొనసాగించే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీకి మరొకరిని నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. మిన్నీ సహా ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలించాక చివరికి బిస్వాల్ వైపు మొగ్గుచూపారు. ఒడిశాకు చెందిన బిస్వాల్ 1981 బ్యాచ్ అధికారి. రాష్ర్ట్టేతర అధికారి నియామకమే మేలన్న ఉద్దేశంతో బిస్వాల్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version