ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయోగించిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలం అయ్యింది. విఫలం అయ్యింది అనడం కంటే చంద్రయాన్ 2 ద్వారా పంపించిన ల్యాండర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దాంతో చంద్రుడిపై ఇండియా ముద్ర పడబోతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా భారతీయులు అంతా షాక్ అయ్యేలా ఫలితం వచ్చింది. దాంతో దేశం మొత్తం కూడా నిరాశ పడింది. అయితే చంద్రుడిపై మన విక్రమ్ క్రాష్ ల్యాండ్ అయ్యిందని, క్రాష్ ల్యాండ్ అయినా కూడా ల్యాండర్ విక్రమ్ చెక్కు చెదరకుండా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ల్యాండర్ సేఫ్‌గానే ఉన్న కారణంగా దాని నుండి సిగ్నల్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తల సహకారంతో ల్యాండర్‌కు సిగ్నల్స్ పంపించడం, దాని నుండి సిగ్నల్స్‌ను రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆ పని మొదలు పెట్టడం జరిగింది. ల్యాండర్ విక్రమ్‌ను రీచ్ అయ్యేందుకు శక్తివంతమైన రేడియో ప్రీక్వెన్సీలను పంపించడం జరుగుతోంది. అయితే విక్రమ్ కాల పరిమితి కేవలం 14 రోజులు మాత్రమే. అందులో ఇప్పటికే కొన్ని రోజులు పూర్తి అయ్యాయి. దాంతో ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.