రాఖీ కట్టిన అక్కచెల్లెళ్లకు అరుదైన కానుక


రాఖీ పండుగ గురుంచి చెప్పాలంటే అక్కాచెల్లెళ్లు వాళ్ళ తోబుట్టువులైన అన్నదమ్ములకు రాఖీ కట్టడం, అందుకు అన్నదమ్ములు వారి స్థాయి తగ్గట్టు రాఖీ కట్టిన అక్కచెల్లెళ్లకు స్వీట్లు, చీరలు, డబ్బులు, విలువైన బహుమతులు ఇవ్వడం సర్వసాధారణమే. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే కర్ణాటకలోని బెలగావీ జిల్లాలో సంప్రదాయానికి కాస్త కొత్తగా పండుగ జరుపుకున్నారు. రాఖీ కట్టిన అక్కచెల్లెళ్లకు స్వీట్లు, చీరలు, డబ్బులు, విలువైన బహుమతులు కాకుండా వారికోసం టాయిలెట్స్ నిర్మించి ఇచ్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది సోదరులు ఇలా నిర్ణయించుకున్నారు.

అక్కడ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్న తోబుట్టువుల పరిస్థితి చూసి రాఖీ సందర్భంగా తమ అక్కాచెల్లెళ్ల కోసం వాటిని నిర్మించి కానుకగా ఇవ్వాలని బెలగావీ జిల్లా పరిషత్ సీఈఓ గా పనిచేస్తున్న ఆర్ రామచంద్రన్‌ అక్కడ వారికీ తెలిపాడు. ఇలా అక్కడ అన్నదమ్ములు ఆయన మాటను గౌరవించి జిల్లా వ్యాప్తంగా 2,400 మరుగుదొడ్లు నిర్మించి తమ అక్కాచెల్లెళ్లకు బహుమతిగా అందజేశారు.

టాయిలెట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. జనరల్ కేటగిరీకి రూ.12,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.15,000 వంతున అందజేసింది. అలా వచ్చిన నిధులకు మరికొంత సొమ్ము జోడించి సోదరులు తమ సోదరి కోసం మరుగుదొడ్లు నిర్మించారు. కుటుంబసభ్యులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందజేయడానికి తమ అడుగుజాడల్లో మిగతావారు నడవాలని మరుగుదొడ్లు నిర్మించిన సోదరులు భావిస్తున్నారు. అక్కడ వారు సీఈఓ కు ధన్యవాదాలు తెలపగా, ఆయన ఆలోచనకు జిల్లావ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

మరో విషయం ఏంటంటే తమ మంచి కోరి అరుదైన కానుక అందజేసిన సోదరులకు వాటి ముందే ఆడుపడుచులు రాఖీలు కట్టడం విశేషం.