Site icon TeluguMirchi.com

తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులకు మార్గనిర్దేశనం చేసిన ఎయిమ్స్ వైద్యులు

Corona Tracker

కోవిడ్-19 రోగులలో సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను గమనించడం జరిగింది. గొంతులో గరగర, చికాకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు కూడా చాలా అరుదుగా గమనించడం జరిగింది.  మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే, మీరు వెంటనే ఇతరుల నుండి దూరంగా, ఐసోలేషన్ లో ఉండాలి.  కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడిన రోగుల కోసం “మందుల వాడకంతో పాటు ఇళ్ళల్లో ఐసోలేషన్ లో సంరక్షణ” అనే అంశంపై నిర్వహించిన వెబీనార్ సందర్భంగా ఢిల్లీలోని ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ నీరజ్ నిశ్చల్ ఈ విషయాన్ని తెలియజేశారు.  వెబీనార్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” నిర్వహించింది.

ఈ వ్యాధి సోకిన రోగులలో 80 శాతం మంది చాలా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు.  ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలో నెగిటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నట్లయితే, మరొక పరీక్ష చేయించుకోవలసిందిగా సిఫార్సు చేయడం జరిగింది.  ఆసుపత్రిలో చేరాలా వద్దా అనే విషయాన్ని, వ్యాధి తీవ్రత ఆధారంగా, నిర్ణయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో పాటు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, 60 ఏళ్ళు పైబడిన రోగులకు, ఇళ్ళవద్ద ఐసోలేషన్ లో ఉంచాలన్న నిర్ణయాన్ని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

“తేలికపాటి లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు చికిత్స సమయంలో సవరించిన మార్గదర్శకాలు” అనే అంశంపై, ఢిల్లీలోని  ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ మనీష్, మాట్లాడుతూ,  ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువగా ఉన్న రోగులను, ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చాలని, సూచించారు. ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసి, నిర్ధారణ చేసే సమయంలో, రోగి వయస్సుతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను పరిగణలోకి తీసుకోవాలి. 

ఐవర్‌మెక్టిన్” వాడకం గురించి డాక్టర్ మనీష్ మాట్లాడుతూ, రోగనిరోధక శక్తి స్థాయితో పాటు, రోగికి ఉన్న ఇతర నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి, ఈ మందును, ఉపయోగించాలని తెలియజేశారు.  “పారాసెటమాల్” విషయంలో కూడా ఇదే సూచనలు పాటించాలి.  అందువల్ల, వైద్యులు సూచించే మందులు మాత్రమే చేయాలి.

ఫాబిఫ్లు” గురించి, ఆయన తెలియజేస్తూ, కోవిడ్-19 చికిత్సకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో “ఫాబిఫ్లూ” వాడకం గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. 150 మంది రోగులపై “గ్లెన్‌మార్క్” చేసిన పరిశోధనల ఆధారంగా ఈ సిఫార్సు చేయడం జరిగింది. అయితే, “ఐవర్‌మెక్టిన్” వాడకం గురించి ఈ మార్గదర్శకాల్లో చేర్చలేదు. 

చాలా మంది రోగులు “అజిత్రోమైసిన్” వాడతామని పట్టుబడుతున్నారు, అయితే, ఈ మాత్రలు వాడవద్దని మార్గదర్శకాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అదేవిధంగా, “రెవిడాక్స్” వాడవద్దని కూడా సూచించడం జరిగింది.  ఇళ్ళల్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు,  “రెవిడాక్స్” ఉపయోగించవద్దని డాక్టర్ చెప్పారు.

ఇళ్ళల్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు, వైద్యులని సంప్రదించకుండా, ఎటువంటి మందులు తీసుకోరాదని, ఈ చర్చ సందర్భంగా, ఇద్దరు నిపుణులు, స్పష్టంగా చెప్పారు. 

Exit mobile version