ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా ఆకట్టుకునే ప్రదర్శ చేసింది. తొలుత ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేసిన భారత్ తర్వాత బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. శనివారం ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(28 ), ఛెతేశ్వర్ పుజారా(7 ) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 11 ఓవర్లకు 36/1తో నిలిచారు. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను మిచెల్ స్టార్క్ ఆదిలోనే దెబ్బతీశాడు.
తొలి ఓవర్ చివరి బంతికి మయాంక్ అగర్వాల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. ఓపెనర్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరగడంతో భారత్ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం నిలకడగా ఆడిన గిల్, పుజారా వికెట్ కాపాడుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది.