తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ఆయన ఆదేశించారు. 9వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, వైద్యారోగ్య, విద్య, మున్సిపల్, అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఈరోజు సీఎం అత్యున్నత సమీక్షను నిర్వహించారు.

ఈ భేటీలో ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభం పైనే సుదీర్ఘ చర్చ కొనసాగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ, విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. దీంతో, పాఠశాలల పునఃప్రారంభానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 20 రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దాదాపు 10 నెలలుగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.