Site icon TeluguMirchi.com

ఓటీటీలో రానా దగ్గుబాటి ‘మాయాబజార్ ఫర్ సేల్’.. ఎప్పుడంటే ?


వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించనుంది. జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. గౌత‌మి చ‌ల్లగుల్ల రైట‌ర్‌ కమ్ డైరెక్టర్‌‌గా‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాజీవ్ రంజ‌న్ నిర్మిస్తున్న ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

కాగా గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన కథతో మాయాబజార్‌ ఫ‌ర్ సేల్‌ తెరకెక్కింది. ఈ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉండే వారంద‌రూ ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని గ‌డ‌పాల‌ని అనుకుంటుంటారు. ఆ స‌మ‌యంలో వారి గేటెడ్ క‌మ్యూనిటీ అన‌ధికారికమైన క‌ట్ట‌డ‌మంటూ ప్ర‌భుత్వం నుంచి ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. వాటిని కూల‌గొట్ట‌డానికి బుల్డోజ‌ర్స్ వ‌స్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే మాయా బజార్‌ ఫర్ సేల్ చూడాల్సిందే.

ఇక ఇందులో న‌వ‌దీప్, ఈషా రెబ్బా, న‌రేష్ విజ‌య్ కుమార్‌, హ‌రితేజ‌, ఝాన్సీ ల‌క్ష్మీ, మియాంగ్ చంగ్‌, సునైన‌, కోట శ్రీనివాస‌రావు త‌దిత‌రులు త‌మ‌దైన అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రాణం పోశారు. త్వ‌ర‌లోనే జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సెటైరిక‌ల్ డ్రామా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే నమ్మకంతో వున్నారు మేకర్స్.

Exit mobile version