యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ చిత్రం తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కేవలం ‘బాహుబలి’ సినిమాకే కేటాయించాడు. మరే సినిమాను కూడా ఈ గ్యాప్‌లో ఒప్పుకున్నది లేదు. ఒక హీరో కెరీర్‌లో నాలుగు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ చిత్రానికి ముందు ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రానికి గాను 4.5 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడు. ఇక ‘బాహుబలి’ సినిమాకు మొదటగా ప్రభాస్ 10 కోట్ల పారితోషికంతో కమిట్ అయ్యాడు. సినిమా రేంజ్ పెరగడంతో పాటు, డేట్లు ఎక్కువ కావాల్సి రావడంతో మొత్తంగా 50 కోట్ల పారితోషికంను ‘బాహుబలి’ నిర్మాతలు ప్రభాస్‌కు ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ మొదటి పార్ట్‌పారితోషికంగా 20 కోట్లను అందుకోగా, రెండవ పార్ట్ పారితోషికంగా 30 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడు. ఒక సౌత్ హీరో ఈ స్థాయిలో పారితోషికాన్ని అందుకోవడం చాలా అరుదు. అయితే ఇదే ప్రభాస్ సంవత్సరానికి వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే ఇంత కంటే ఎక్కువ పారితోషికం వచ్చేదని కొందరు అంటున్నారు. అయితే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చేదని మాత్రం ఏ ఒక్కరు గట్టిగా చెప్పలేరు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయి బ్రాండ్స్ కూడా ఆయన ప్రమోషన్ చేయాలని ఎదురు చూస్తున్నాయి.