’మాటల’కే మాట నేర్పిన మాంత్రికుడు

trivikramఈ మధ్యకాలంలో.. పిల్లోడు, పనోడు, పాలోడు, మనోడు.. ప్రతివోడు పంచ్ లేస్తున్నాడు. అదేమీట్రా.. అసలు వీరికింత పదజాలం ఎక్కడిది..? అంటే త్రివిక్రమ్ సినిమాలు చూడట్లేదాయేంటీ..! అనే మరో పంచ్ పడేస్తున్నారు. అంతగా వెళ్లాయి త్రివిక్రమ్ మాటలు. ఆయన మాట ఓ మంత్రంలా పనిచేస్తోంది. ఇప్పుడు అదే మాట తెలుగుచిత్రసీమను ఏలుతోంది. ఇదివరకు సినిమా డైలాగ్ అంటే షాన్తాడంతుండేది. ఇప్పుడు షార్ట్ గా తయారైంది. ఇదంతా త్రివిక్రమ్ మాయాజాలమే. ప్రేమ, పెళ్లి, పేదరికం, పెద్దరికం, స్నేహం, అహం, బాధ్యత, బంధాలు, అనుబంధాలు, కుర్రాడి జులాయి వేశాలు, కురవృద్ధిని గోస ఇలా.. ఏ సందర్భంలోనైనా.. తన మాటలతో మాయ చేస్తాడు త్రివిక్రమ్. అందుకే.. టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా మారిపోయాడు.

’స్వయంవరం’ చిత్రం ద్వారా మాటల రచయితగా త్రివిక్రమ్ తెరంగేట్రం చేశాడు. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మళ్లీశ్వరి, అతడు చిత్రాలకు ఉత్తమ మాటల రచయితగా అవార్డులందుకున్నాడు. ’నవ్వే నువ్వే’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. ‘అతడు’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు. సినిమా సినిమాకి త్రివిక్రమ్ మాటకు పదును పెరుగుతూనే వుంది. ఎంతగా అంటే.. మాటలే కోటలు దాటి కోట్లు కుమ్మరించేలా.. ఆ కోట్లు వంద కోట్లను చేరుకునేలా. ఆడపిల్లను అత్తారింటికి పంపినంత శ్రద్దగా ముస్తాబు చేసి మరీ.. మాటలను వదులుతాడు. మాటపై ఆయనకున్న మమకారం అలాంటిది.

ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ 43వ పుట్టినరోజు. త్రివిక్రమ్ భవిష్యత్ చిత్రాలు, ఆయన మాటలు మరిన్ని కోటలు దాటి.. మరిన్ని కోట్లు కుమ్మరిస్తూ.. మరెన్నో కోట్ల హృదయాలను తాకాలని కోరుకుంటూ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మిర్చి డాట్ కామ్.