గ‌బ్బర్ సింగ్ కి స‌వాల్ విసురుతున్న బాద్‌షా

baadsha-gabbarsingబాక్సాఫీసు లెక్కలు మారిపోతున్నాయ్‌.., రికార్డుల తిర‌గ‌మోత ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ సినిమా హిట్టయితే ఆ ఫ‌లితం ఏ రేంజులో ఉంటుందో సినీ విశ్లేష‌కుల‌కు అర్దమ‌వుతోంది. అనుకొన్నట్టే బాక్సాఫీసు ద‌గ్గర బాద్‌షా చెల‌రేగిపోతున్నాడు. వ‌సూళ్లు దండుకొంటున్నాడు. పాత రికార్డుల‌కు పాత‌ర వేసే స‌మ‌యం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నాడు. గ‌త శుక్రవారం ప్రారంభ‌మైన బాద్‌షా ప్రభంజనం ఆదివారం వ‌ర‌కూ దిగ్విజ‌యంగా కొనసాగింది. మధ్యలో రెండు రోజులు కలెక్షన్లు డ్రాప్ అయినా.. ఉగాది రోజున మ‌రోసారి పుంజుకొని నిర్మాత‌కు సంతోషాన్ని తెచ్చిపెట్టాడు. అన‌ధికార కలేషన్ల ప్రకారం బాద్‌షా తొలి ఏడు రోజుల్లో దాదాపు రూ.30 కోట్లు వ‌సూలు చేసింది. గబ్బర్ సింగ్ రికార్డుకు కాస్త ద‌గ్గరగా వెళ్లగలిగాడు. తొలివారం గ‌బ్బర్ సింగ్ రూ.33 కోట్లు వ‌సూలు చేశాడు. నైజాంలో బాద్‌షా రూ. 8.6 కోట్లు దండుకొన్నాడు. సీడెడ్ లో రూ.6 కోట్లు ద‌క్కాయి, గుంటూరు (3.5 కో), కృష్ణ (3.4), వెస్ట్ (2.75) తూర్పు (3.7) వైజాగ్ (3.7) ఇలా ప్రతి చోటా…. బాద్‌షా దూసుకెళ్తున్నాడు. ఈ వ‌సూళ్లు ఇలాగే కొన‌సాగితే గ‌బ్బర్ సింగ్ రికార్డులు బ‌ద్దలవ్వడం ఖాయం.. అని నంద‌మూరి అభిమానులు అంచ‌నాలు వేసుకొంటున్నారు.

బాద్‌షాకి అన్నీ క‌లిసొస్తున్నాయి. తొలుత ఈ సినిమాపై పాజిటివ్ టాక్ న‌డిచింది. దాంతో తొలి మూడు రోజులూ వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఎన్టీఆర్‌కి ఈసారి ఎలాగైనా హిట్ వ‌స్తే బాగుణ్ణు అని… అంద‌రూ కోరుకొన్నారు. ఆ సానుకూల దృక్పధంతో పాటు, శ్రీ‌నువైట్ల గ‌త రికార్డు.. బాగా క‌లిసొచ్చి… థియేట‌ర్ల వ‌ద్ద జ‌నం క్యూ క‌ట్టారు. బాద్‌షాకి పోటీగా మ‌రో సినిమా కూడా లేక‌పోవ‌డంతో బాద్‌షాకి ఎదురు లేకుండా పోయింది. బాద్‌షాని క్లీన్ హిట్ అని చెప్పడానికి కూడా ఎన్టీఆర్ అభిమానులు ధైర్యం చేయ‌డం లేదు. ఎందుకంటే… వెదికి చూస్తే ఎన్నో లోటు పాట్లు. దూకుడులా ఉంద‌ని చెప్పిన‌వాళ్లూ ఉన్నారు. ఫ‌స్టాప్ డ‌ల్ అని తేల్చిపాడేశారు. పాట‌లూ ఎక్కలేదు. అయినా స‌రే… వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తుందంటే కార‌ణం ఒక్కటే …మ‌రో పెద్ద సినిమా బ‌రిలో లేక‌పోవ‌డం. అంతెందుకు….? ఉగాది రోజున బాద్‌షా తో పాటు జై శ్రీ‌రామ్ థియేట‌ర్లు కూడా ఫుల్ అయ్యాయి. అంటే జ‌నం సినిమాలేక ఎంత క‌రువుతో ఉన్నారో అర్థం అవుతోంది.

ఆ లోపాలు లేకుండా బాద్ షా … క్లీన్ హిట్ టాక్ అందుకొంటే గ‌బ్బర్ సింగ్ రికార్డుల‌కు ఏనాడో గండి కొట్టేవాడు. అయినా ఇప్పుడు మించిపోయిందేం లేదు. మ‌రో రెండు వారాల వ‌ర‌కూ పెద్ద సినిమా లేదు. షాడో, గ్రీకువీరుడు మూకుమ్మడిగా వ‌చ్చినా.. బాద్షా వ‌సూళ్లకు ఢోకా ఉండ‌దు. సో… గ‌బ్బర్ సింగ్ అభిమానులకు కాస్త టెన్షన్ త‌ప్పదిక.