మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో రవితేజ నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈరోజు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నువ్వు సీతవైతే.. నేను రాముడినంటా..నువ్వు రాధవైతే.. నేను క్రిష్ణుడినంటా..నువ్వు లైలావైతే..నేను మజ్నూనంటా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. దేవి శ్రీ ప్రసాద్ ఫ్రెష్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. మంచు కొండల మధ్యలో శృతి, చిరు ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొంటుంది.ఈ సాంగ్ కు లిరిక్స్ అందించింది దేవి శ్రీ ప్రసాద్ కావడం విశేషం. ఇక మొదటిసారి ఈ సాంగ్ లో చిరు తన పేరును తానే ఉచ్చరించాడు.. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంటూ తనను తానే పొగుడుకున్నాడు. మొత్తానికి ఈ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. యూరప్ లొకేషన్స్ సాంగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.