నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, ఝాన్సీ, కౌశిక్ మెహతా, రాజీవ్ కనకాల, రాజశేఖర్ అనింగి తదితరులు
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాత: బీవీఎస్ ఎన్ ప్రసాద్
సంగీతం: బి. అజనీష్ లోక్ నాథ్,
స్క్రీన్ ప్లే : సుకుమార్
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5
సాయి ధరమ్ తేజ్ చివరిగా నటించిన సినిమా ‘రిపబ్లిక్’ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ కు బైక్ యాక్సిడెంట్ కావడం.. కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న అనంతరం ఆయన నటించిన లేటెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ `విరూపాక్ష`. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథ :
ట్రైలర్ లో చూపించిన విధంగా ఈ కథ మొత్తం రుద్రవనం అనే మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. చేతబడి చేస్తూ చిన్న పిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ ఓ జంటను గ్రామస్థులు సజీవ దహనం చేస్తారు. వారు మంటల్లో కాలిపోతూ పుష్కర కాలం తర్వాత ఈ ఊరు వల్లకాడు అయిపోతుందని శపిస్తారు. వారి మాటలని నిజం చేస్తూ రుద్రవనంలో వరుస మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురి కావడంతో గ్రామ పెద్దలు ఊళ్లోకి ఎవరూ రాకుండా అష్టదిగ్భంధనం చేస్తారు. అయినా సరే మరణాలు మాత్రం ఆగవు. ఇదే సమయంలో సూర్య(సాయి ధరమ్ తేజ్) తన తల్లితో కలిసి రుద్రవంలోని తన బంధువుల ఇంటికి వస్తాడు. అక్కడ నందిని ( సంయుక్త మీనన్) ని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వాళ్ళ ఊర్లోనుండి బయటకి వచ్చేసినా మళ్ళీ నందిని అనారోగ్యం దృష్యా రుద్రవనానికి వెళతాడు. రుద్రవనం చుట్టూ ఏం జరుగుతోంది? .. హత్యల వెనక ఎవరున్నారు?.. ఈ విషయాల్ని ఛేదించి సమస్యలని పరిష్కరించే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో సూర్య ఎదుర్కొన్న సవాళ్లేంటీ?.. రుద్రవనాన్ని కాపాడటం కోసం సూర్య విరూపాక్షుడిగా ఎలాంటి సాహసాలు చేసాడనేది వెండితెరపై చూడాల్సిందే..
పెర్ఫార్మన్స్ :
బైక్ యాక్సిడెంట్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తరవాత సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రమిది. అంతా ఊహించినట్టుగానే సినిమాలో సాయి ధరమ్ తేజ్ ని చూపించిన తీరు, కనిపించిన విధానం బాగుంది. వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో సాయి ధరమ్ తేజ్ నటన ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంది. అంతే కాకుండా పోరాట ఘట్టాల్లో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రదర్శించిన నటన మెప్పిస్తుంది. ఇక నందిని పాత్రలో సంయుక్త మీనన్ సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రధమార్థంలో అందంగా తనదైన గ్లామర్ తో అలరించిన సంయుక్త మీనన్ ద్వితీయార్థంలో మాత్రం థ్రిల్ కి గురి చేస్తూ ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రతి సినిమాకు లేని ఓ ప్రత్యేకత ఈ సినిమాకు ఉంది. అదేంటంటే ప్రతి సినిమాలో పాత్రలు ఏంటనేది తెలిసిపోతుంది. కానీ ఇందులో అలా కాదు.. సినిమా సాగుతున్న ప్రతీ దశలోనూ ఓ కొత్త పాత్ర ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ని కలిగిస్తూ ఉంటుంది. సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, రవికృష్ణ, సోనియా సింగ్ పాత్రలకు తగ్గట్టు చేసారు.
పాజిటివ్స్ :
స్క్రీన్ ప్లే
పాత్రకు తగ్గట్లు నటీనటుల ఎంపిక
ఫైనల్ ట్విస్ట్
నెగటివ్స్ :
అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు
ఫైనల్ పాయింట్ : అదరగొట్టిన విరుపాక్షుడు