Site icon TeluguMirchi.com

‘విడుదల పార్ట్ 1’ ట్రైలర్.. మరో కాంతారా కానుందా ?


వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో అన‌గారిన జీవితాల్లోని చీక‌టి కోణాల్ని వెండితెర‌పై ఆవిష్కరిస్తూ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ సినిమాలు చేస్తుంటారు. జాతీయ స్థాయిలో ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డుల్ని సొంతం చేసుకున్న ఆయ‌న తొలి సారి క‌మెడియ‌న్ సూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన పీరియ‌డ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `విడుతలై పార్ట్ 1`. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీలోని కీల‌క క్యారెక్ట‌ర్ లో విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టించారు. త‌మిళంలో మార్చి 31న విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ‘విడుదల పార్ట్ 1’ గా విడుదల కాబోతుంది.

ఇప్పటికే కాంతారా వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 15న విడుదల చేస్తుంది. కాగా ఈరోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం మరియు అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి, ఇక తనని తాను నిరూపించుకోవాలని చూసే చిన్నపాటి కానిస్టేబుల్ గా సూరి ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని ఈ ట్రైలర్ లో చూపించారు. అయితే ఈ సినిమా ‘గీత ఆర్ట్స్’ కి కాంతారా లాగా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్.

ఇక మరోవైపు ఈ చిత్రాన్ని తమిళంలో చూసిన స్టార్ హీరో రజనీకాంత్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ‘విడుద‌లై త‌మిళ సినిమాల్లో ఇంత వ‌ర‌కు చూడ‌ని క‌థ‌. ఇదొక మాస్ట‌ర్ పీస్‌. సూరి యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్‌. ఇళ‌య‌రాజా కింగ్ ఆఫ్ మ్యూజిక్‌. వెట్రిమార‌న్ ప్రైడ్ ఆఫ్ త‌మిళ సినిమా. నిర్మాత‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను` అని త‌మిళంలో ట్వీట్ చేశారు.

Exit mobile version