Site icon TeluguMirchi.com

రివ్యూ : ‘వేటాడు… వెంటాడు’

ఫలించని వేట… ‘వేటాడు… వెంటాడు’

కొత్త దారులు వెతుక్కుంటూ వెళ్ళడం తమిళ దర్శకుల అలవాటు. దర్శకుడితో పాటు ఆ కష్టాన్ని పంచుకుంటూ ఆ ప్రయోగాల ఫలితాలలో వాటా అందుకోవడం కోసం కధానాయకులు కుడా ఏమాత్రం వెనకడుగు వేయరు. విక్రమ్, సూర్య, కార్తీ.. తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం దక్కించుకున్నారంటే కారణం ఇదే. ఇప్పుడు విశాల్ కుడా అదే దారిలో నడిచాడు. రెగ్యులర్ పాట, ఫైట్, రొమాన్స్ అనే… కాన్సెప్ట్ కి కామా పెట్టి.. హీరోయిజాన్ని మరో విభిన్నమైన దారిలో చూపించే ప్రయత్నం చేశాడు. ఆ సినిమానే ‘వేటాడు… వెంటాడు’. కొరియన్, ఇటాలియన్ తరహా స్క్రీన్ ప్లే తో అల్లుకున్న ఈ సినిమా కి ఎన్ని మార్కులు వేయొచ్చు? విశాల్ కెరియర్ మళ్ళీ గాడిలో పడడానికి ఈ సినిమా ఎంత వరకూ ఉపయోగ పడుతుంది? తెలుసుకుందాం రండి.

ఊటీలో నివసించే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తనయుడు శంకర్ (విశాల్), రూపా (సునయన) ప్రేమించుకుంటారు. అయితే శంకర్ కి చెప్పాపెట్టకుండా రూప బ్యాంకాక్ వెళ్ళిపోతుంది. రూప ఎందుకు వెళ్ళిపోయిందో శంకర్ కి అర్ధం కాదు. ఓ రోజు… ‘పదే పదే నువ్వే గుర్తొస్తున్నావ్. చూడకుండా ఉండలేను. నువ్వు కూడా బ్యాంకాక్ వచ్చేయ్’ అని కబురు పంపిస్తుంది. సరే… అని శంకర్ కూడా బ్యాంకాక్ బయలుదేరతాడు. ఎయిర్ పోర్ట్ లో శంకర్ కి మాయ (త్రిష) పరిచయం అవుతుంది. అయితే… బ్యాంకాక్ లో రూప జాడ కనిపెట్టలేకపోతాడు. పైగా అనుకోని షాక్ లు ఎదురవుతాయి. తనలాగే మరొకరు బ్యాంకాక్ లో వున్నట్టు తెలుస్తుంది. ఎవరో తనని చంపడానికి వెంబడిస్తున్నట్టు అనుమానం వేస్తుంది. ఏది నిజమో, ఏది భ్రమో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోతాడు. ఇంతకీ రూప ఏమయ్యింది? శంకర్ లా వున్నా వ్యక్తి ఎవరు? తనని చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా ఆచూకి శంకర్ కనిపెట్టాడా? లేదా? ఈ విషయాలన్నీ ‘వేటాడు… వెంటాడు’ చూస్తే తెలుస్తాయి.

అనుకోని మలుపులతో అల్లుకున్న కధ ఇది. సస్పెన్స్ ద్రిల్లర్ తరహాలో సాగుతుంది. ‘ఇది ఫార్ములా సినిమా కాదు’ అనే విషయం టైటిల్ కార్డ్ పడుతున్నప్పుడే అర్ధమవుతుంది. దానికి తోడు… శంకర్ పాత్ర అయోమయానికి గురి కావడంతో… కధ, కధనాలు వేగం అందుకుంటాయి. శంకర్ బ్యాంకాక్ లో అడుగు పెట్టడం మొదలు… అతన్ని ఓ ముఠా వెంబడించడం… తనలాంటి మరో వ్యక్తి వున్నాడనే విషయం తెలుసుకోవడం.. ఇవన్నీ ఓ పజిల్ లా ప్రేక్షకుడి మెదడుకి మేత పెడతాయి. ఓ కొరియన్ సినిమా మన తెర పై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే… అదంతా విశ్రాంతి సన్నివేశం వరకే. ఆ తరవాత కధ ని ఎలా నడపాలో దర్శకుడికి అర్ధం కాలేదు. సస్పెన్స్ సినిమాల్లో చిక్కుముడి వేసుకుంటూ వెళ్లి… ద్వితీయార్ధం లో దాన్ని విప్పుకుంటూ రావడం ఓ గొప్ప టెక్నిక్. అయితే… ఈ దర్శకుడు మొదటి అంకం వరకే సఫలీకృతుడు అయ్యాడు. చిక్కు ముడులు విప్పడం ఎలాగో తెలీక… అది విలన్ల వాయిస్ ఓవర్ లో చెప్పేసాడు. దాంతో హీరో పాత్ర తేలిపోయి…. కధలోని బిగుతు సడలి పోయింది. ఇదే కధ అనుభవం వున్న దర్శకుడి చేతిలో పెడితే ఫలితం వేరేలా వుండేది. శంకర్ పాత్ర అయిన దానికీ, కాని దానికి గందరగోళంలో పడుతూ వుంటుంది. అక్కడ గొప్ప సస్పెన్స్ వున్నట్టు బ్యాక్ గ్రౌండ్ సౌండ్ తో యువన్ అదర గొట్టేస్తూ వుంటాడు. తెరపై అంత సీన్ లేకపోయే సరికి… సన్నివేశానికి, ఆర్.ఆర్ కీ పొంతన కుదర లేదు. కదానాయకుడితో.. ప్రతి నాయకులు ఆడుకోవడానికి పెద్ద కారణం లేకపోవడం ప్రధానమైన మైనస్.

విశాల్ తనకు అలవాటైన దారిలోనే చక చక నటించేసాడు. విశాల్ కాకుండా మరో హీరో అయితే.. ఈ సినిమా బాగుండేది అనుకుంటే అది ప్రేక్షకుల తప్పు కాదు. మనోజ్ బాజ్ పేయ్, జేడీలు ఈ కధకు ఫ్రెష్ లుక్ తీసుకు రావడానికి ప్రయత్నించారు. త్రిష, సునయన పాత్రల నుంచి అటు నటన, ఇటు స్కిన్ షో… రెండూ ఆశించకూడదు. యువన్ బాణీ లు తెలుగు సాహిత్యంతో సరిగా మిళితం కాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించడంలో హాలీవుడ్ స్ఫూర్తి కనిపిస్తుంది. అవన్నీ… మాస్ కి బాగా నచ్చుతాయి. దర్శకుడు, హీరో, మిగిలిన సాంకేతిక నిపుణులు.. సగం మనసు పెట్టి తీసిన సినిమాలా కనిపిస్తుంది. వారంతా 50 శాతం మాత్రమె న్యాయం చేశారు. అందుకే… వెంటాడారు కాని…. ఫలితం కనిపించలేదు.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Review

Exit mobile version