వరుణ్ తేజ్ #VT13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.. త్వరలోనే టైటిల్ ప్రకటన ?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం #VT13 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్, VFX స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ చిత్రయూనిట్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. ఒక పోస్టర్ కూడా రివీల్ చేసారు. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న IAF అధికారిగా కనిపించారు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు. ఇక భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నామన్నారు.