మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ మొదట్లో పర్వాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాల వల్ల వరుణ్ తేజ్‌కు పెద్దగా ఒరిగిందేం లేదు. దాంతో తదుపరి చిత్రాన్ని అయినా గట్టిగా ప్లాన్ చేసుకోవాలని వరుణ్ డిసైడ్ అయ్యాడు. అందుకే తొలి చిత్రం ‘ఘాజీ’తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కుర్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డితో జత కట్టాడు. వరుణ్ తేజ్‌కు సరిపోయే ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్దం చేస్తున్నాడు దర్శకుడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టును కూడా రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కించనున్నాడు.
సంకల్ప్ రెడ్డి తనకున్న జ్ఞానం మొత్తం ఉపయోగించి ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని తెరకెక్కించాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. అందుకు భారీ గ్రాఫిక్స్ అవసరం. ఈ చిత్రాన్ని బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ భారీ నిర్మాతతో డీల్ కుదుర్చుకున్నారు. ఇక గ్రాఫిక్స్ తదితర అంశాలకు అవసరమయ్యే ఖర్చులను సాఫీగా చేయొచ్చు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఫిదా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే సంకల్ప్ రెడ్డితో చేయనున్నాడు. ఈ కుర్ర దర్శకుడు అయినా వరుణ్ తేజ్‌ను గట్టెక్కిస్తాడా అని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇది కూడా సక్సెస్ కాకపోతే వరుణ్‌కు ఇక సినీ ఇండస్ట్రీలో కాలం చెల్లినట్టే అని సినీ ప్రముఖులు అంటున్నారు.