Matka : డిసెంబర్ నుంచి వరుణ్ తేజ్ ‘మట్కా’ రెగ్యులర్ షూటింగ్


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు.

యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఇకపోతే 24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కు హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ పూర్తి మేక్ఓవర్ అవుతున్నారు. ఇక వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘మట్కా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.