‘బాహుబలి’ దారిలోనే ‘ఉయ్యాలవాడ’.. చెర్రీ అతి తెలివి

‘బాహుబలి’ చిత్రం విడుదలయిన అన్ని భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. విడుదలయిన నాటి నుండి నేటి వరకు కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. ఆయా భాషల్లోని స్టార్‌ నిర్మాతలు కూడా ‘బాహుబలి’ వైపే చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకమైలు రాయిగా భావించి తమ చిత్రాలకు ప్లాన్‌లు వేసుకుంటున్నారు. తాజాగా చరణ్‌ కూడా ఈ జాబితాలోకి చేరిపోయాడు. చిరు నటించిన 150వ చిత్రం ‘ఖైదీనెం.150’ని తెరకెక్కించి వంద కోట్ల లాభాలను పొందాడు. దాంతో చిరు తదుపరి చిత్రాన్ని కూడా చరణ్‌నే నిర్మించాడానికి రెడీ అయ్యాడు. మెగాస్టార్‌ చిరంజీవి తదుపరి చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కించనున్నాడు.

పక్కా సమాచారంతో సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రం అగస్టులో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ స్థాయికి తీసుకెళ్లాలని రామ్‌ చరణ్‌ భావిస్తున్నాడు. అందుకే ‘బాహుబలి’ యూనిట్‌ చేసినట్టుగానే ఈ చిత్ర బిజినెస్‌ను చేయడానికి సిద్దమవుతున్నాడు. బాలీవుడ్‌లోని బడా నిర్మాతలతో చేయి కలిపితే మంచి క్రేజ్‌ వస్తుంది అని ‘బాహుబలి’ నిరూపించింది. దాంతో చెర్రీ కూడా అలాగే చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. తెలుగు, హిందీ, తమిళం, మళయాల భాషలలో కూడా ఈ చిత్రం రూపొందనుంది. అతి తెలివి వాడుతున్న చెర్రీకి ఇది వర్కౌట్‌ అవుతుందా చూడాలి.