Site icon TeluguMirchi.com

Deepavali : ఆసక్తికరంగా ‘దీపావళి’ ట్రైలర్.. మీరు చూశారా ?


అనగనగా ఓ మేక. దాని పేరు అబ్బులు! దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాలి.

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’ కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకుంది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉస్తాద్ రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

Deepavali Trailer | Poo Ramu, Kaali Venkat, Deepan | Ra.venkat | ‘Sravanthi’ Ravi Kishore | Theeson

పల్లెటూరి నేపథ్యంలో ‘దీపావళి’ తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే పల్లెలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సహజంగా ఆవిష్కరించారు. తాత, మనవడు, మేక మధ్య బంధాన్ని బలంగా చూపించారు. దీపావళి పండక్కి కొత్త డ్రస్ కొని ఇవ్వమని మనవడు అడగడంతో మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతాడు. మొక్కుబడి మేక కావడంతో ఊరి జనాలు దానిని కొనడానికి ముందుకు రారు. అయితే కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని వీరబాబు ఆ మేక కొనడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత మేకను మరొకరు దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైందనేది వెండితెరపై చూడాలి. మేకకు ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు సప్తగిరి వాయిస్ ఇచ్చారు.

Exit mobile version