Mass Jathara : చక్రి ఏఐ వాయిస్ తో ‘తు మేరా లవర్’ సాంగ్ రిలీజ్


మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ సినిమా ‘మాస్ జాతర’ నుంచి తొలి పాట ‘తు మేరా లవర్’ విడుదలైంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించగా, ఇప్పుడు విడుదలైన తొలి పాట మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ‘తు మేరా లవర్’ ప్రోమో మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. రవితేజ-శ్రీలీల జోడీ మరోసారి స్క్రీన్‌పై అద్భుతమైన కెమిస్ట్రీతో మాయ చేస్తూ, ఈ పాటను మాస్ గీతంగా నిలిపారు. శ్రోతలను వెంటనే ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట ప్రేక్షకులను థియేటర్లలోనూ అలరిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. రవితేజ ప్రత్యేక డ్యాన్స్ మూమెంట్స్, శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ పాటకు సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా, భాస్కరభట్ల సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. రవితేజ ‘ఇడియట్’ సినిమాలోని ఐకానిక్ సాంగ్ “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” కు ట్రిబ్యూట్‌గా రూపొందిన ఈ పాటలో ప్రత్యేకంగా, దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని AI సాంకేతికత ద్వారా తిరిగి సృష్టించడం విశేషం. దర్శకుడు భాను బోగవరపు, సినిమాను రవితేజ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దుతుండగా, ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న విజువల్స్‌కి బలం చేకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.