అతనొక కార్పొరేట్ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్ళను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పనిగట్టుకుని ఎలక్షన్ల కోసం ఇండియాకు రావడానికి కారణమేంటి? భారత్‌లో ఏం చేశాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘సర్కార్’ చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిథి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలు. దీపావళి సందర్భంగా వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ”నవాబ్’ లాంటి సూపర్‌హిట్ తర్వాత మురుగదాస్, విజయ్ సూపర్‌హిట్ కాంబినేషన్ మరో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లకు, వర్కింగ్ స్టిల్స్‌కు, ట్రైలర్‌కు స్పందన బావుంది. ‘మీ ఊరి నాయకుడిని మీరే కనిపెట్టండి.. ఇదే మన సర్కార్’ అని విజయ్ పలికిన సంభాషణలకు రెస్పాన్స్ అదిరిపోతుంది. ఇలాంటి డైలాగ్‌లో సినిమాలో మరెన్నో ఉన్నాయి. కత్తి, తుపాకీ తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. రెహమాన్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక చేస్తాం. నవంబర్ 6న సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు.