Site icon TeluguMirchi.com

మూడు హిట్లూ… ఆరు ఫ్లాపులూ

toolywood-sixmoths-report * తొలి ఆరు నెల‌ల టాలీవుడ్‌

అప్పుడే 2013 క్యాలెండ‌ర్ పాత‌బ‌డిపోయింది. నిన్నో మొన్నో సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకొన్నట్టుంది. ఈలోగా వేస‌వి కూడా వెళ్లిపోయింది. ఆరునెల‌ల పోగ్రెస్ రిపోర్ట్ త‌యారైపోయింది. తొలి ఆరునెల‌లు పరిశ్రమ కు మిశ్రమ ఫ‌లితాలు లభించాయి. పెద్ద సినిమాలు సంతృప్తినిచ్చాయి. ఆశ‌లు పెంచుకొచ్చినవి ముంచేశాయి. తొలి ఆరు నెలల్లో దాదాపు 85 సినిమాలు విడుల‌య్యాయి. వాటిలో ఏడు మాత్రమే హిట్ చిత్రాల జాబితాలో నిలిచాయి. నాయ‌క్‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మిర్చి, స్వామిరారా, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, త‌డాఖా, ప్రేమ‌క‌థాచిత్రమ్ బాక్సాఫీసు ద‌గ్గర మంచి ప‌లితాల్ని సాధించాయి.

సంక్రాంతి ముందొచ్చిన నాయ‌క్‌, పండ‌క్కి వినోదాల‌ను పంచిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు హిట్ జాబితాలో చేరిపోయాయి. వినాయ‌క్ మరోసారి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా ఎంచుకొన్నాడు. చిరంజీవి అభిమానుల‌కు న‌చ్చేలా సినిమా తీశాడు. శుభ‌లేఖ రాసుకొన్న పాట రీమిక్స్‌ తో మెగా ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకొన్నాడు. బ్రహ్మానందం, జెపి, పోసాని త్రయం వినోదాన్ని పంచిపెట్టింది. దాంతో నాయ‌క్ ప్రేక్షకుల మ‌న‌సు గెలిచాడు. ఇక‌… సీతమ్మ – కుటుంబ నేపథ్యంలో సాగిన సినిమా. ఇద్దరు హీరోల‌ను చూపించిన విధానం, పాట‌లు ఇవ‌న్నీ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకొన్నాడు. పండ‌క్కి మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో సీత‌మ్మ మంచి వసూళ్లు అందుకొంది. ఆ త‌ర‌వాత ప్రభాస్ వంతు వ‌చ్చింది. మిర్చితో ప్రభాస్ బాక్సాఫీసు ద‌గ్గర ఘ‌న విజ‌యం అందుకొన్నాడు. ప్రభాస్‌ ని కొర‌టాల శివ చూపించిన విధానం, దేవిశ్రీ అందించిన సంగీతం ఈ సినిమాని నిల‌బెట్టాయి. పాత సినిమాల‌న్నీ క‌ల‌సి క‌ట్టుగా తీశారు అనే అప‌వాదు మూట‌గ‌ట్టుకొన్నా ప్రేక్షకులు దాన్ని ప‌ట్టించుకోలేదు. ఈ సినిమా త‌ర‌వాత కొర‌టాల శివ‌… పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు.

చిన్న సినిమాగా వ‌చ్చిన స్వామి రారా కూడా మంచి మార్కులు సంపాదించింది. కేవ‌లం రూ.4 కోట్ల పెట్టుబ‌డితో వ‌చ్చిన ఈ సినిమా రూ.10 కోట్లు సాధించింది. కొత్త ద‌ర్శకుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాతో త‌న టాలెంట్‌ ని చూపించుకొన్నాడు. ఇక వేస‌విలో నితిన్ ప్రేమ క‌థా చిత్రంతో ముందుకొచ్చాడు. అదే గుండెజారి గ‌ల్లంత‌య్యిందే. ప్రేమ‌, వినోదం, మంచి పాట‌లు మేళ‌వించిన ఈ సినిమా యువ ప్రేక్షకుల‌కు బాగా న‌చ్చింది. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ సినిమా. దాదాపుగా రూ.20 కోట్లు వ‌సూళ్లు సాధించింద‌ని ఓ అంచ‌నా!

నాగ‌చైత‌న్య కూడా చాలా కాలం త‌ర‌వాత ఓ హిట్టు కొట్టి.. త‌న త‌డాఖా చూపించాడు. వెట్టై సినిమాకి ఇది రీమేక్‌. అయితే తెలుగు ప్రేక్ష‌కుల‌కు నచ్చేలా మార్పులు, చేర్పులు చేయ‌గ‌లిగాడు. ఈ సినిమానే డాలీకి నాగ్‌తో జ‌త క‌ట్టే అవ‌కాశం తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ప్రేమ క‌థా చిత్రమ్ కూడా హిట్ కొట్టేసింది. వినోదం, హార‌ర్ ల మేళ‌వింపు ప్రేక్షకుల‌కు బాగా న‌చ్చింది. కృష్ణ మేన‌ల్లుడు సుధీర్‌బాబు తొలి విజ‌యాన్ని రుచి చూశాడు.

అయితే అంచ‌నాలు పెంచుకొచ్చిన సినిమాలు… బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టాయి. పెద్ద హీరోల‌కు క‌ల‌సి రాలేదు. వెంక‌టేష్ సినిమా షాడో… ఘోర ప‌రాజ‌యం పాలైంది. గ్రీకువీరుడు. ఇద్దర‌మ్మాయిల‌తో కూడా ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకోక‌పోయాయి. ఇక ఎన్టీఆర్ బాద్ షా హిట్ – యావ‌రేజ్ ల‌మ‌ధ్య ఊగిస‌లాడి, చివరికి యావ‌రేజ్ సినిమాగా మిగిలిపోయింది. చావుత‌ప్పి క‌న్నులొట్టబోయిన చందాన‌… పెట్టుబ‌డిని అతి కష్టమ్మీద రాబ‌ట్టుకోగ‌లిగింది.

ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్ స్ఫూర్తితో వ‌చ్చిన చిన్న సినిమాలు కూడా స‌రైన ఫలితాన్ని సాధించ‌లేక‌పోయాయి. చివ‌ర్లో వ‌చ్చిన బ‌లుపు హిట్టూ, యావ‌రేజ్ కి మ‌ధ్యన ఊగిస‌లాడుతోంది. అనువాదాలు కూడా చేదు అనుభవాలే మిగిల్చాయి. కేవ‌లం క‌మ‌ల్ హాస‌న్ విశ్వరూపం మాత్రమే… నిల‌వ‌గ‌లిగింది. మిగిలిన‌వి ఎప్పుడు వ‌చ్చాయో, ఎప్పుడు వెళ్లాయో తెలీలేదు. వేస‌విలో ఐపీఎల్ వ‌సూళ్లకు భారీగా గండి కొట్టింది. దాంతో.. ప‌రిశ్రమ‌కు స‌మ్మర్ అస్సలు క‌ల‌సి రాలేదు. అందుకే ఫ‌స్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవ‌ల‌సిన సినీ ప‌రిశ్రమ తొలి ఆరు నెల‌ల్లో పాస్ మార్కుల‌తో స‌రిపెట్టుకొంది.

Exit mobile version