ఈ హీరోలు రిటైర్ అయిపోయినట్టేనా?

telugu-actorsప్రేక్షకుల‌కు కాస్త మ‌తిమ‌రుపు ఎక్కువ‌. ట‌చ్‌లో లేక‌పోతే మ‌ర్చిపోతారు. చేతిలో హిట్టున్నా, లేకున్నా ఏదో ఒక సినిమాతో క‌నిపిస్తూ ఉండాలి. ‘వీడు కూడా ఇండ్రస్ట్రీలో ఉన్నాడ‌న్నమాట‌…’ అనుకొంటారు. జ‌నాలు. లేదంటే అడ్రస్ గ‌ల్లంతే! ప్రస్తుతం కొంద‌రు హీరోల చిరునామా తెలీక తెలుగు ప్రేక్షకులు తిక‌మ‌క ప‌డుతున్నారు. సైలెంట్ గా రిటైర్డ్ అయిపోయారేమో అని కూడా అనేసుకొంటున్నారు. అలాంటి హీరోల లిస్టు తీస్తే కుసింత పెద్దదే వ‌చ్చింది.

జ‌గ‌ప‌తిబాబు, త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌, రాజ‌శేఖ‌ర్‌, జేడీ చ‌క్రవ‌ర్తి వీళ్లంతా సినిమాల్లేక ఖాళీగా ఉన్నారు. జ‌గ‌ప‌తిబాబు అప్పుడ‌ప్పుడూ ఏదో ట్రై చేస్తున్నాడు గానీ వ‌ర్కవుట్ అవ్వడం లేదు. ఏజ్ బార్ అయిపోయిన ఛాయ‌లు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. మొన్నే ఆప‌రేష‌న్ దుర్యోధ‌న – 2 వ‌చ్చింది. ఇది ఇప్పటి సినిమా కాదు. ఎప్పుడో పూర్తయి.. ఎన్నో గండాలు దాటి విడుద‌ల‌కు నోచుకొంది. ఈ సినిమాలో కీ రోల్ చేశాడు జ‌గ‌ప‌తి. కీ రోల్ క‌దా.. దానికి త‌గ్గట్టే కీ ఇచ్చిన‌ట్టు అటూ ఇటూ కదిలాడు గానీ – ఆ న‌ట‌న‌లో ఇది వ‌ర‌క‌టి హుషారు లేదు. జ‌గ‌ప‌తిబాబు ప‌ని అయిపోయింది అని ఆ సినిమా చూసినోళ్లు బాహాటంగానే విమ‌ర్శించారు. ఆయ‌న న‌టించిన ఏప్రెల్ ఫూల్ ఎప్పుడు విడుద‌ల అవుతుందో తెలీదు. ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబు చేతిలో సినిమాల్లేవు. జ‌గ‌జ్జంత్రీ అనే ఓ సినిమా చేస్తున్నాడ‌ట‌. అదెప్పుడు వ‌స్తుందో… ఎవరికీ తెలీదు.

ఉద‌య్ కిరణ్ కెరీర్ కూడా చాలా దారుణంగా ఉంది. ల‌వ‌ర్ బోయ్ నుంచి మాస్ ఇమేజ్‌కి షిప్ట్ అవ్వాల‌నుకోవ‌డ‌మే… ఉద‌య్ చేసిన నేరం. వ‌రుస‌గా మూడు హిట్లు కొట్టిన త‌ర‌వాత‌.. ఇప్పటి వ‌ర‌కూ అత‌ని కెరీర్లో కనీసం యావ‌రేజ్ అనే మాట కూడా విన‌లేదు. మొన్నొచ్చిన జై శ్రీ‌రామ్ కూడా త‌న్నేసింది. ఉద‌య్ కిర‌ణ్‌తో సినిమాలు తీసి ఆస్తులమ్ముకోవ‌డం ఇష్టం లేక ప్రొడ్యూస‌ర్లు సైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ ల‌వ‌ర్ బోయ్‌కీ సినిమాల్లేవు.

త‌రుణ్ ప‌రిస్థితీ ఇంచుమించు ఇంతే. ఈ హీరోకి క‌నీసం శాటిలైట్ మార్కెట్ కూడా ఢామ్మ‌ని ప‌డిపోయింది. చుక్క‌లాంటి అమ్మాయి.. చ‌చ్చీ చెడీ రిలీజ్ అయ్యింది అనిపించారు. యుద్ధం సినిమామ‌ధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు నిర్మాత‌గా మారాడ‌ట‌. త‌న సినిమాల్ని త‌నే తీసుకోవ‌డం మిన‌హా చేసేదేముంది?

రాజ‌శేఖ‌ర్‌, జేడీల ప‌రిస్థితి మ‌రీ దారుణం. జేడీ అప్పుడ‌ప్పుడూ మెగా ఫోన్ ప‌ట్టి త‌న ముచ్చట తీర్చుకొంటున్నాడు. త‌మిళం,హిందీ అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. రాజ‌శేఖ‌ర్‌కి ఆ ఛాన్స్ కూడా లేదు. వ‌రుస ఫ్లాప్‌ల‌తో త‌న ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. మ‌హంకాళి కూడా ప‌ల్టీలు కొట్టింది. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ జోలికి వెళ్తామంటే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. అర్జున సినిమా ఏమ‌య్యిందో తెలీదు. ఈ పరిస్థితుల్లో కొత్త సినిమా మొద‌ల‌వ్వడం అనుమాన‌మే. కొన్ని రోజులు పోతే శ్రీ‌హ‌రి కూడా ఈ లిస్టులో చేరే అవ‌కాశం ఉంది. ఎందుకంటే సోలో హీరోగా అవ‌కాశాలు రావ‌డం లేదు. గెస్ట్ పాత్రలు చేస్తున్న సినిమాల‌న్నీ క‌ల‌సిరావ‌డం లేదు. ఈనేప‌థ్యంలో శ్రీ‌హ‌రి కూడా సినిమాల‌పై దృష్టి త‌గ్గించిన‌ట్టు స‌మాచార‌మ్‌..

వీళ్లంతా ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై త‌మ హ‌వా చూపించిన వాళ్లే. ఇప్పుడు మాత్రం బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. కాలానికి ఎదురెళ్లి హిట్ కొట్టి… త‌మ స్టామినాను మ‌రో సారి నిరూపించుకొంటారో, కామ్‌గా సైడ్ అయిపోతారో కాల‌మే చెప్పాలి. ఈ హీరోలంతా మ‌రో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాల‌ని… స‌రికొత్త పాత్రల‌తో దూసుకెళ్లాల‌ని తెలుగు మిర్చి మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటోంది.