TFJA : తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26న) ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఐ స్క్రీనింగ్ పరీక్షలు అందించారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, యువ నిర్మాత నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read : Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ గ్రాండ్ సక్సెస్.. టీమ్ హ్యాట్రిక్ హిట్ సెలబ్రేషన్స్ !
ప్రియదర్శి, నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించగా, అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా జరిగింది. హెల్త్ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శి కూడా తన కంటి పరీక్ష చేయించుకోగా, వైద్యులు ఆయన చూపు పరిపూర్ణంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, “జర్నలిస్టుల ఆరోగ్యం కోసం విశేషంగా శ్రద్ధ తీసుకుంటున్న అసోసియేషన్ సభ్యులకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు,” అని చెప్పారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ హెల్త్ క్యాంప్‌లో 100 మందికి పైగా జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.