సంక్రాంతి వార్ లో పైచేయి సాధించేదెవరు..? ఇద్దరిలో ‘వీర’త్వం చూపేదెవరు..?


తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా పండుగ. ప్రతీ సీజన్ లో కూడా క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్ళు పెద్ద హీరోలు దూరంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు బరిలో దిగుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలయ్య చేసిన ‘వీర సింహా రెడ్డి’ వంటి రెండు సినిమాలు ఈసారి ఒకరోజు గ్యాప్ తో ఫెస్టివల్ రేసులోకి దిగుతున్నాయి. ఎన్నో తర్వాత వీరిద్దరూ ఒకేసారి వస్తుండటంతో సినీ ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అందుకే సీనియర్ హీరోల్లో ఎవరు పై చేయి సాధిస్తారు? ఎవరు విన్నర్ గా నిలుస్తారు? ఏ సినిమా ఎంత వసూలు చేస్తుంది? అంటూ చాలా రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా.. ‘వీర సింహారెడ్డి’ సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ పై రూపొందడం గమనార్హం. తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయని చెప్పాలి.

ఇప్పటి వరకూ బాలయ్య మరియు చిరంజీవి సినిమాలకు సమానమైన క్రేజ్, బజ్ ఉందని చెప్పాలి. సాంగ్స్ – టీజర్ – ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ మెగా నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఇరు వర్గాల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా గ్రాండ్ సక్సెస్ అవడంతో వీరయ్య – వీరసింహా థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ తో హిట్టు కొట్టి మరోసారి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంటారని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్న వింటేజ్ చిరు ఈసారి తన సత్తా ఏంటో చూపిస్తాడని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి తమ సినిమాల పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్న ఇద్దరు అగ్ర హీరోలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.