వాడి వేడిగా ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్’ ఎన్నికలు !


టాలీవుడ్ లో ఎన్నికల వేడి మరోసారి రాజుకుంది. నిర్మాతల మండలి ఎన్నికలు ఫిబ్రవరి 19న జరగబోతున్నాయి. ఈ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సారి నిర్వహిస్తూ ఉండటం విశేషం. రెండు వర్గాల నిర్మాతలు ఈ ఎన్నికలలో తమ బలాలు నిరూపించుకోవాలని చూస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ కి సి కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ వర్గంలో చిన్న నిర్మాతలు ఎక్కువగా ఉన్నారు. ఇక దిల్ రాజు నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ లో పెద్ద సినిమాల నిర్మాతలతో పాటు ప్రస్తుతం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మరి ఈ రెండు ప్యానెల్స్ లో ఎవరిదీ పై చేయి అవుతుందో చూడాలి మరి.

ఇక ఈ రెండు వర్గాల మధ్య ఇప్పటికే ఎన్నికల విమర్శలు ప్రతి విమర్శలు కూడా మొదలయ్యాయి. సి కళ్యాణ్ టీమ్ నుంచి అధ్యక్షుడిగా జెమిని కిరణ్, కార్యదర్శులుగా ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి పోటీ పడుతుండగా.. ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుండి అధ్యక్షుడిగా కెఎల్ దామోదర్ ప్రసాద్ పోటీ పడుతున్నారు.

ఇదిలా ఉండగా ‘మళ్ళీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మసూద’ వంటి హాట్ చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క ఎన్నికల బరిలోకి దిగారు. ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఎన్నికలను ఫస్ట్ టైం ఆయన ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఆలోచనలతో పాటు, నూతన ఉత్సాహం ఎంత అవసరమో, తన లాంటి రన్నింగ్ లో వున్న నిర్మాతల సేవలు అంతే అవసరమని భావించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ఈ సందర్బంగా ఆయన తెలిపారు.