తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకు వెళ్లేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైజాగ్ లేదా విజయవాడ, అమరావతిలో సినీ ప్రముఖుల కోసం కారు చవుకగా భూములు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అండ్ కో సిద్దంగా ఉన్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయిన తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పట్లో అమరావతికి వెళ్లడం దాదాపు అసాధ్యం అని ప్రముఖులు అంటున్నారు. తాజాగా కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితమే టాలీవుడ్ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నుండి అమరావతికి వెళ్లాల్సిన ఆవశ్యకత లేకపోవడంతో ఆ దిశగా టాలీవుడ్ ప్రముఖులు ఆలోచనలు చేయడం లేదు. అయితే కొందరు ఔత్సాహిన నిర్మాతలు మరియు సినీ పెద్దలు మాత్రం అమరావతి లేదా వైజాగ్‌లో చిన్న తరహా స్టూడియోలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లో అన్ని విధాలుగా షూటింగ్స్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు, సకల సౌకర్యాలు ఉండటం కారణంగా అమరావతి ఆలోచన చేయడం లేదు. భవిష్యత్తులో ఎప్పటికి టాలీవుడ్ పూర్తిగా ఏపీకి తరలి వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలో కూడా కొన్ని స్టూడియోల నిర్మాణం జరగడం, కొందరు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగవచ్చు. అంతే తప్ప టాలీవుడ్ పూర్తిగా ఏపీకి వెళ్లడం అనేది అయ్యే పని కాదు.