తమిళ నిర్మాతలను ఉద్దేశించి హీరో ధనుష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. చాలా మంది నిర్మాతలు హీరోలకు మరియు నటీనటులకు పారితోషికం ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొందరు నటీనటులు ఏకంగా తమ పని పక్కన పెట్టి నిర్మాతల వద్దకు పారితోషికం విషయమై తిరగాల్సి వస్తుంది అంటూ ధనుష్ సీరియస్ అయ్యాడు. తమిళ నిర్మాతలను అవమానిస్తూ ధనుష్ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. తమిళ నిర్మాతలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే హీరో ధనుష్ అంటూ విమర్శలు చేస్తున్నారు.
ధనుష్ గతంలో నటించిన పలు సినిమాల నిర్మాతలు ఆర్ధికంగా నష్టపోయారంటూ నిర్మాత అళగప్పన్ అన్నాడు. అజిత్, విజయ్ వంటి వారు నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తారు. కాని ధనుష్ మాత్రం నిర్మాతలను పట్టించుకోకుండా వారి ఇష్టానుసారం అంటూ వదిలేస్తాడంటూ ధనుష్‌పై మండి పడ్డాడు. ధనుష్ తో 10 కోట్లతో సినిమా తీస్తే దాన్ని 8 కోట్లకు అమ్మడం సాధ్యం అవ్వడం లేదని, ఆయన వల్ల నిర్మాతలకు నష్టాలు తప్ప మరేం లేవని, అలాంటి ధనుష్ నిర్మాతల గురించి మాట్లాడుతున్నాడా అంటూ మరో నిర్మాత కె రాజన్ విమర్శలు చేశాడు. ఇంకా పలువురు నిర్మాతలు కూడా ధనుష్‌ను టార్గెట్ చేస్తున్నారు.