కూతురి ప్రేమ… బిగ్‌బాస్‌ ఇంట్లో తండ్రి రచ్చ

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బిగ్‌బాస్‌ కార్యక్రమం హవా సాగుతోంది. పలు రియాలిటీ షోలతో పోలిస్తే ఈ కార్యక్రమంకు మంచి స్పందన వస్తోంది. తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఇటీవలె 50రోజులను పూర్తి చేసుకుంది. కాగా తమిళంలో ఈ కార్యక్రమానికి తాజాగా 80రోజులు పూర్తి అయ్యాయి. దాంతో కంటెస్టెంట్‌లు హోమ్‌సిక్‌గా ఉండడంతో వారి కుటుంబ సభ్యులను బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఆహ్వానించారు. చాలా రోజులుగా తమ వారిని మిస్‌ అవుతున్న కంటెస్టెంట్‌లు వారిని చూడగానే ఉద్వేగభరితమయ్యారు. కొందరైతే ఎగిరి గంతేశారు.

తమిళ బిగ్‌బాస్‌ లో ఇటీవల ఓ ఇంటి సభ్యురాలికి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. తనే అందంతో, ఆటతో ఇటీవల చాలా పాపులర్‌ అవుతూ వస్తున్న లోస్లియా. ఈ అమ్మడు బిగ్‌బాస్‌ ఇంట్లో తోటి కంటెస్టెంట్‌ కెవిన్‌తో కాస్త చనువుగా ఉంది. దాంతో ఈ ఇద్దరి మద్య క్లోజ్‌నెస్‌ బాగా పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ ఇంట్లోకి తనకోసం వచ్చిన తండ్రిని చూడగానే లోస్లియా చాలా ఎమోషనల్‌ అయ్యింది. కానీ తన తండ్రి మాత్రం విచిత్రంగా ప్రవర్తించి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా షాకిచ్చారు. వస్తూ వస్తూనే కూతురు లోస్లియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను ఇలాగేనా పెంచింది, కెవిన్‌తో నీ ప్రేమాయణం ఏంటి అంటూ ఎడాపెడా తిట్ల దండకం మొదలెట్టాడు. దాంతో లోస్లియా గుక్కపెట్టి ఏడ్చేసింది. కన్నీటిభరితమైన ఈ అమ్మడిని చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా ఈమె తండ్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రేమ అంత పెద్ద నేరం కాదు అంటూ యువత లోస్లియాకు మద్దతుగా నిలిచారు.