తమిళ ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇక తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిషలు జంటగా నటించారు. తెలుగులో వారిద్దరి స్థానంలో శర్వానంద్ మరియు సమంతలు నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 96 చిత్రం రీమేక్ ఎలా ఉంటుందా అంటూ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ రీమేక్‌లోని సమంత లుక్ బయటకు వచ్చింది. చాలా సింపుల్‌గా ఒక చుడిదార్ వేసుకుని సమంత కనిపించింది. 96 చిత్రంలో త్రిష కూడా చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఆమె లుక్కు జనాలు ఫిదా అవుతున్నారు. త్రిషలాగే సమంత ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం సమంత లుక్ కూడా మార్చడం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత లుక్ రివీల్ అవ్వడంతో మళ్లీ చాలా రోజుల తర్వాత 96 చిత్రం గురించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సమంత ఈ చిత్రంలో తన బెస్ట్ ఇవ్వబోతుంది. ఓ బేబీ చిత్రం తర్వాత సమంతకు ఇది మరో హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.