సైరా విషయంలో దిల్ రాజు అస్సలు తగ్గడం లేదు..

మెగా స్టార్ చిరంజీవి – నయనతార జంటగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి.ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో చిత్ర రైట్స్ దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు.

ఇప్పటికే నైజాం ఏరియా ను యువి క్రియేషన్స్ వారు రూ. 30 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు రాగా..తాజాగా ఉత్తరాంధ్ర రైట్స్ విషయంలో దిల్ రాజు – క్రాంతి క్రాంతిరెడ్డి మధ్య పోటీ ఏర్పడుతుందని సమాచారం. ఉత్తరాంధ్ర సైరా పంపిణీ హక్కుల కోసం సీనియర్ ఎగ్జిబిటర్ క్రాంతిరెడ్డి 14.5 కోట్ల ఎన్ఆర్ఎ కింద దాదాపు ఓకే చేయించుకున్నారు. మరో డిస్ట్రిబ్యూటర్ గాయత్రి ఫిలింస్ 13.5కోట్ల వరకు వెళ్లి ఆగిపోయారు.

ఇదిలావుంటే క్రాంతిరెడ్డికి హక్కులు దాదాపు ఇచ్చేసారు అనే టైమ్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అడ్డంపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పెద్ద ప్లేయర్ గా వున్నారు దిల్ రాజు. ఆయన 15 కోట్లకు పైగా ఆఫర్ చేసి, తనకు హక్కులు ఇవ్వాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చివరకు సైరా రైట్స్ ఎవరికీ దక్కుతాయో చూడాలి.