చిరు నృత్యాలే నాకు స్ఫూర్తి: ఆది

adiప్రేమ కావాలి, ల‌వ్లీ సినిమాల‌తో విజ‌యాలు అందుకొన్నాడు.. ఆది. ఇప్పుడు సుకుమారుడుగా ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. నిషా అగ‌ర్వాల్ క‌థానాయిక‌. పిల్ల‌జ‌మిందార్‌తో ఆక‌ట్టుకొన్న ఆశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు. తొలి క్యాసెట్‌ని వంశీపైడిప‌ల్లి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆది మాట్లాడుతూ “చిరంజీవిగారు చేసిన‌ట్టు ఎవ‌రూ చేయ‌లేరు. నాకు ఆయ‌నే స్ఫూర్తి. ఇది స్టేట్‌మెంట్ కాదు.. ఆయ‌న‌లా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా. లవ్లీ వ‌చ్చి యేడాది అయ్యింది. మ‌ళ్లీ అలాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రంలో న‌టిస్తున్నా. కృష్ణ‌గారితో క‌లిసి న‌టించ‌డం గొప్ప అవ‌కాశం. ఈ జ‌న‌రేష‌న్‌లో ఎవ‌రికీ ద‌క్క‌ని ఛాన్స్‌నాకు దక్కింది`న్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “తెలుగుద‌నం ఉట్టిప‌డే చిత్ర‌మిది. ఆది పాత్ర ఈనాటి ట్రెండ్‌కి త‌గిన‌ట్టు ఉంటుంది. అనూప్ అందించిన బాణీలు త‌ప్ప‌కుండా న‌చ్చుతాయి. ఆ పాట‌ల‌న్నీ సింగిల్ సిట్టింగ్‌లోనే ఒకే అయ్యాయ‌“న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సాయికుమార్‌, నాని, ఇషా అగ‌ర్వాల్‌, కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, వేణుగోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.