కన్నడ చిత్రాలలో నెగెటివ్ పాత్రలతో కెరియర్ ప్రారంభించి హీరోగా ఎదిగాడు సుదీప్. అందరూ శాండల్ వుడ్ లో తనని కిచ్చా అని పిలుచుకుంటారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఏకంగా బాలీవుడ్లోనే సినిమాలు చేసినప్పటికీ మన రాజమౌళి దర్శకత్వంలో ఈగ చేసిన తర్వాతే ఎక్కడలేని గుర్తింపు వచ్చేసిందనేది నిజం. ఈగ సక్సెస్ దెబ్బతో కన్నడంలో సుదీప్ చేసిన సినిమాలు వరుసగా తెలుగులోకి అనువదించ బడుతున్నాయి. ఇంతకుముందు ‘లవ్జర్నీ’ చిత్రాన్ని నిర్మించిన జక్కుల నాగేశ్వరరావు నిర్మాతగా సుజాత ఆర్ట్స్ సంస్థ సుదీప్ కన్నడంలో చేసిన ఓ చిత్రాన్ని ‘ఈల’ పేరుతో తెలుగులోకి అనువదిస్తోంది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దండుపాళెం ఫేమ్ పూజాగాంధీ కథానాయిక. ‘చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. “ఈ నెల్లో ఆడియో విడుదల చేస్తాం. చిత్రంలో ఆరు పాటలు, ఆరు ఫైట్లు ఉన్నాయి. సంగీత దర్శకుడు సా«ధుకోకిల ఈ చిత్రంలో హాస్య పాత్ర పోషించడం విశేషం. వచ్చే నెల్లో సినిమా రిలీజ్ చేస్తాం” అని తెలిపారు నిర్మాత. ఈ చిత్రానికి మాటలు : పోతుల రవికిరణ్, సంగీతం: విద్యాసాగర్, కథ, స్క్రీన్ప్లే, దర్వకత్వం: గురుదత్.