నాన్నది పాలకొల్లు. మావయ్యది మొగల్తూరు. ఒకరు మెగా ప్రొడ్యూసర్, ఇంకొకరు మెగాస్టార్! తాత ఆల్రెడీ… కుమ్మేశాడు. గిన్నిస్ బుక్ ఎక్కి… తానేమిటో నిరూపించుకొన్న ఘనుడు. అల్లు అర్జున్ బ్యాక్ గ్రౌండ్ ఇది! అయితే ఇవి చూసి ముచ్చట పడలేదు. `ఇంకేముంది, మనకూ పరిశ్రమలో ఓ ప్లేసు గ్యారెంటీ..` అని ధీమాగా కూర్చోలేదు. ఇంటి పేరు కాపాడాలంటే మామూలు విషయం కాదు అనుకొన్నాడు. అరకొర ప్రతిభతో అడుగుపెడితే.. ఎప్పటికైనా అల్లు అరవింద్ కొడుకనో, మెగాస్టార్ మేనల్లుడనో చెప్పుకొంటారు తప్ప… తనకంటూ సొంత గుర్తింపు దక్కదనుకొన్నాడు. అందుకే… కష్టపడ్డాడు.. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. ఆ చెమట బిందువే.. అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ చేసింది! అల్లు అరవింద్ అబ్బాయి బన్నీ… అనిపించుకొనే స్థాయి నుంచి బన్నీ వాళ్ల నాన్నగారు అరవింద్ అని చెప్పుకొనే పొజిషన్ కి చేరుకొన్నాడు. అదీ… బన్నీ ఘనత.
`గంగోత్రి`తో బన్నీ అడుగుపెట్టి.. మార్చి 28తో పదేళ్లు పూర్తవుతాయి. ఈ దశాబ్దంలో బన్నీ ఎంతో సాధించాడు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది, తనకంటూ ఓ అభిమాన గణం ఉంది. బన్నీ సినిమా అంటే.. అన్ని హంగులూ ఉంటాయనే నమ్మకం ఉంది. అయితే ఇదంతా తేలిగ్గా దొరకలేదు. గంగోత్రి సినిమా హిట్టే. కానీ ఆ సినిమా చూసి `కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు` అనుకొన్నారంతా. `ఇంకా మీసాలు రాలేదు, హీరోగా ఎర్లీ ఇంట్రీ పనికిరాదు..` అని విమర్శించినవాళ్లూ ఉన్నారు. ఆ సినిమా క్రెడిట్ అంతా దర్శకేంద్రుడి ఖాతాలో చేరిపోయింది. ఇక `ఆర్య`తో బన్నీ స్టామినా తొలిసారి తెలిసింది. నటన, డాన్స్, ఫైట్స్ ఇలా అన్నిటా తానేమిటో నిరూపించుకొన్నాడు. బన్నీతో 100% మాస్ హీరో అయిపోయాడు. బన్నీ సినిమా అంటే అందులో అదిరిపోయే స్టెప్పులు ఉండాల్సిందే. ఆర్య 2 చూసి… డాన్స్ ప్రియులు తెగ ముచ్చట పడ్డారు. టాలీవుడ్లో డాన్స్ అంటే.. బన్నీ గుర్తుకురావల్సిందే. ఆ సినిమా ఆశించినంత ఫలితం తీసుకురాలేదు. కానీ.. బన్నీలో ఓ కొత్త యాంగిల్ జనానికి తెలిసింది. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించి వారెవా అనిపించాడు.
ఎప్పుడూ ఓ మాస్ హీరోగానే మిగిలిపోవాలని బన్నీ అనుకోలేదు. తన స్థాయికి తగినట్టు ప్రయోగాలూ చేశాడు. వేదం అలాంటి సినిమానే. ఆ సినిమా మరింత కమర్షియల్ విజయం సాధిస్తే.. బన్నీ ఆ దిశగా అడుగులు వేసేవాడేమో. కానీ.. నిర్మాతకు లాభాలు అందకపోడంతో కాస్త వెనుకడుగు వేశాడు. టాలీవుడ్‌కి స్టైల్ అనే పదం కొత్తగా పరిచయం చేసింది అల్లు వారి పిల్లడే. దేశముదురుతో తొలిసారి సిక్స్‌ప్యాక్ చూపించిన టాలీవుడ్ స్టార్ అయ్యాడు. ఆ తరవాత అందరూ బన్నీని ఫాలో అయ్యారు. బద్రినాథ్‌తో అతని యాక్షన్ స్టామినా పరిశ్రమకు మరోసారి తెలిసొచ్చింది. జులాయితో ఎంతోకాలంనుంచి ఎదురుచూస్తున్న నిఖార్సయిన విజయం అందుకొన్నాడు. ఇప్పుడు ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నాడు. కేరళలో తనకంటూ ఓ అభిమాన గణాన్ని సంపాదించుకొన్న బన్నీ… ఇప్పుడు తమిళంలోనూ పాగా వేయాలనుకొంటున్నాడు. అక్కడా బన్నీ విజయపతాక ఎగరవేయాలని తెలుగు మిర్చి మనసారా ఆకాంక్షిస్తోంది. రాబోయే పదేళ్ళలో బన్నీ.. మరింత పైకి ఎదగాలని, ప్రేక్షకుల్ని ఇలాగే మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటోంది. ఆల్ ది బెస్ట్..