సోనీ టీవీలకు బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళి


ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.6,353 కోట్లు సాధించింది. ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్స్, వయో ల్యాప్‌టాప్స్‌ విభాగాలతో కలిపి 2014–15లో సోనీ ఇండియా రూ.11,000 కోట్ల ఆదాయం సముపార్జించింది. సంస్థకు అతి పెద్ద మార్కెట్ల పరంగా యూఎస్, చైనా, జపాన్‌ తర్వాత నాల్గవ స్థానంలో భారత్‌ నిలిచింది. స్మార్ట్‌ టీవీ, ఆడియో, డిజిటల్‌ ఇమేజింగ్‌ ఉత్పత్తులు ప్రస్తుత వృద్ధిని నడిపిస్తున్నాయని సోనీ ఇండియా ఎండీ సునీల్‌ నయ్యర్‌ తెలిపారు. చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేతుల మీదుగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత 2024 బ్రావియా 9, 8, 7, 3 సిరీస్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రాజమౌళి వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ టీవీల విభాగం భారీ వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు. టీవీల వ్యాపారంలో మార్కెటింగ్‌పైన రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు.