అల్లరోడి క‌ల తీరుతోందా?

allari-nareshఅనుభ‌వం ఉన్న ద‌ర్శకుల‌తో పనిచేయాల‌ని ప్రతి క‌థానాయ‌కుడికీ ఉంటుంది. విశ్వనాథ్‌, బాపులాంటి ద‌ర్శకులతో ఒక్క సినిమా అయినా చేయాల‌ని క‌ల‌లు కంటారు. న‌రేష్‌కి ఆ ఛాన్స్ ఎప్పుడో ద‌క్కింది. శుభ‌ప్రదం, సుంద‌ర‌కాండ సినిమాలతో ఆ అవ‌కాశం జేజిక్కించుకొన్నాడు. కానీ సింగీతం శ్రీ‌నివాస‌రావుతో సినిమా చేయాల‌నే కోరిక మాత్రం నెర‌వేర‌లేదు. అప్పుడెప్పుడో ట్రాఫిక్ జామ్ అనే సినిమా తెర‌కెక్కతుంద‌ని చెప్పుకొన్నారు. నిర్మాత కూడా దొరికాడ‌న్నారు. కానీ ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మ‌రోసారి సింగీతం – న‌రేష్ సినిమా గురించి కొత్త క‌బురు తెలిసింది. న‌రేష్‌తో ఓ సినిమా చేయ‌డానికి సింగీతం ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యం వెల్‌క‌మ్ ఒబామా ఆడియో వేడుక‌లో స్వయంగా సింగీతం చెప్పారు. ఎన్నో ప్రయోగాల‌కు సిద్దహ‌స్తుడైన సింగీతం న‌రేష్ తో ఎన్ని జిమ్మిక్కులు చేయిస్తారో చూడాలి.