ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నటనతో పాటు నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె స్థాపించిన స్వంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన తొలి సినిమా ‘శుభం’. ఈ చిత్రాన్ని మే 9, 2025 (శుక్రవారం) నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘శుభం’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సెన్సిబుల్ కథనం, హ్యూమర్ తో మేళవించి, ఈ సినిమా ప్రేక్షకులను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేలా ఉన్నదని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ – “ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ ద్వారా వినోదంతో పాటు భావోద్వేగాలు కలిగిన, అర్థవంతమైన సినిమాలను అందించాలనే మా లక్ష్యం. ‘శుభం’ మా టీం ఎంతో శ్రద్ధగా, ప్రేమగా నిర్మించిన చిత్రం. ఈ కథను ప్రేక్షకులతో పంచుకోవడం మాకు గర్వంగా ఉంది” అని తెలిపారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇది తొలి సినిమా కావడం, సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం, మరియు కథ, టెక్నికల్ టాలెంట్ అన్నీ కలిసివచ్చిన ఈ ప్రయత్నం ఎంత వరకూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందో చూడాలి. కానీ ఓపెనింగ్ బజ్ చూస్తే మాత్రం ‘శుభం’ ఓ స్పెషల్ మూవీగా నిలవనుందని చెప్పవచ్చు.