Shiva completes 35 years : 35 సంవత్సరాల ‘శివ’


తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘శివ’, 1989 అక్టోబర్ 5న విడుదలై 35వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకు ముందూ, తరువాత కూడా మార్పులు తెచ్చిన క్రమంలో కీలక పాత్ర పోషించింది. అక్కినేని నాగార్జున టైటిల్ రోల్‌లో నటించి, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సృష్టించగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎస్ ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. తనికెళ్ల భరణి విలన్ పాత్రలో కీలకమైన సహాయకుడిగా నటించడమే కాకుండా, డైలాగ్స్ అందించడం విశేషం.

ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘శివ’ చిత్రం మాఫియా నేపథ్యంతో కాలేజీ విద్యార్థుల మధ్య జరుగుతున్న రాజకీయ అడ్డగోలంపై రూపొందించబడింది. ఈ చిత్రాన్ని తమిళంలో “ఉదయం”గా డబ్ చేయగా, హిందీలో 1990లో అదే టైటిల్‌తో పునర్నిర్మించారు. 35వ వార్షికోత్సవం సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రానికి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు.