Shashtipoorthi : “ఫీల్ గుడ్ సినిమా అవుతుంది” – షష్టిపూర్తి పై రవితేజ ప్రశంశలు


Shashtipoorthi : నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్‌లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో, రూపేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తొలి పాటకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు గొప్ప స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన రెండో పాటకు రెహమాన్ సాహిత్యం రాశారు. ఎస్పీ చరణ్, విభావరి ఆలపించిన ఈ యుగళ గీతాన్ని రాజమండ్రిలో గోదావరి తీరంలో చిత్రీకరించారు. ఈ పాటలోని విజువల్స్‌ను రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తోట తరణి గారి కళా రూపకల్పన ప్రత్యేకంగా నిలిచాయి.

ఈ పాటను ప్రముఖ నటుడు ‘మాస్ మహారాజా’ రవితేజ విడుదల చేస్తూ, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య నటించిన ‘షష్టిపూర్తి’ తప్పకుండా చూడండి. డెఫినెట్‌గా బావుంటుంది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ సినిమా అవుతుందని అనిపిస్తోంది. దర్శకుడు, నిర్మాతతో పాటు నటీనటులందరికీ ఆల్ ద బెస్ట్!” అని తెలిపారు. దర్శకుడు పవన్ ప్రభ ఈ పాట గురించి మాట్లాడుతూ – “ఇళయరాజా గారి ట్యూన్ వినగానే ‘సాగర సంగమం’లోని మౌనమే లనోయ్ పాట గుర్తొచ్చింది. చరణ్, విభావరి ఇద్దరూ లైవ్‌గా, ఒకే ఫీల్‌తో పాట పాడటం ఒక అందమైన అనుభూతి. ఈ పాట సినిమాకే కొత్త అందాన్ని తీసుకొచ్చింది” అని పేర్కొన్నారు. ‘షష్టిపూర్తి’ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్నది.