‘షాడో’… అందరికీ నచ్చే సినిమా : వెంకటేష్

Shadow Audio Launch“కొత్తదారిలో నడిచినప్పుడల్లా అభిమానులు ఆదరించారు. మీ అందరికీ ‘షాడో’ తప్పకుండా నచ్చుతుంది. ఇందులో మాస్ అంశాలు మాత్రమే కాదు. కుటుంబ ప్రేక్షకులకీ, చిన్నపిల్లలకు నచ్చే సన్నివేశాలు వున్నాయి. ఈ వేసవి తప్పకుండా మంచి వినోదం పంచిస్తాం” అన్నారు వెంకటేష్. ఆయన కధానాయకుడిగా నటించిన చిత్రం ‘షాడో’. తాప్సి కధానాయిక. శ్రీకాంత్, మధురిమ కీలక పాత్రలు పోషించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం లోని గీతాలు శుక్రవారం రాత్రి హైదరాబాద్లో విడుదల చేశారు. తొలి క్యాసెట్ ని వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. బోయపాటి శీను స్వీకరించారు.

Shadow Audio Launch1ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ “మెహర్ కధ చెబుతున్నప్పుడే బాగా నచ్చింది. నా కెరియర్లో ఓ మంచి చిత్రం అవుతుందని నమ్మా. చాలా రోజుల తరవాత నేను చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా. మరోసారి శ్రీకాంత్ తో పనిచేయడం ఆనందంగా వుంది. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంటుంది. సాంకేతిక నిపుణులు చాలా కష్టపడ్డారు” అని చెప్పారు. “వెంకటేష్ తో సినిమా చేయడం ఓ గౌరవం. నటనకు ఆయన ఓ నిఘంటువు. ఆయనలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. తమన్ ఈ కధను బాగా అర్ధం చేసుకుని, కధకు తగిన బాణీలు ఇచ్చాడ”న్నారు మెహర్ రమేష్. శ్రీకాంత్ మాట్లాడుతూ “వెంకటేష్ తో ఇది నా నాలుగో సినిమా. ‘సంక్రాంతి’ తరవాత మళ్ళీ కలిసి నటించడం ఆనందంగా వుంది” అన్నారు.