Site icon TeluguMirchi.com

‘సీతమ్మ వాకిట్లో…’ చరిత్ర సృష్టిస్తుందా?

Seethamma Vakitlo Sirimalle Chettuతెలుగు సినిమా ఇప్పుడు కమర్షియల్ హంగులలో కొట్టుమిట్టాడుతోంది. ఏ హీరో సినిమా అయినా సరే… అందులోని కథ మాత్రం సదరు హీరో ధీరొదాత్తమైన గుణాల చుట్టే తెరుగుతోంది. అభిమానులూ అందుకు అలవాటు పడిపోయారు. ఎంత సినిమా అయినా హీరో కి ఓ కుటుంబం వుంటుందని, అమ్మా, నాన్నా, అన్నా, తమ్ముడు అనే అనుబంధాలు వుంటాయనే సంగతి మరిచిపోయారు. అందుకే కుటుంబ కథా చిత్రాలు కరువైపోయాయి. ఈ మధ్య కాలంలో కుటుంబ కథా నేపధ్యంలో వచ్చిన సినిమాలు ఏమిటి? అని ఆలోచిస్తే… టక్కున సమాధానం దొరకదు. ఏడాదికి దాదాపు 120 నుంచి 150 సినిమాలు తయారుచేసే తెలుగు పరిశ్రమలో మనం కుటుంబ కథలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇదా? ‘బొమ్మరిల్లు’ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకుంటారు కానీ.. అందులో కథ… తండ్రీ కొడుకుల మధ్యే తిరుగుతుంది. వెంకటేష్ ‘కలిసుందాం రా’, ‘సంక్రాంతి’ సినిమాల తరవాత.. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వస్తోంది. అందులోనూ ఓ కథానాయకుడు వెంకటేష్ కావడం… యాదృచ్చికం.

ఫ్యామిలీ డ్రామాలను తెలుగు చిత్ర పరిశ్రమ ఆశ్రద్ధ చేస్తున్న ఈ తరుణంలో ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమా రూపుదిద్దుకోవడం… అందులో ఇద్దరు అగ్ర కధానాయకులు కలిసి నటించడం ఓ అరుదైన, అపురూపమైన విషయం. ‘సీతమ్మ..’ సెట్స్ లోకి వెళ్ళక ముందే చరిత్ర సృష్టించింది. పాతికేళ్ళ తరవాత తెలుగులో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఇది. హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళూ మల్టీ స్టారర్ సినిమాలు విరివిరిగా తీస్తున్న తరుణంలో, అసలు మల్టీ స్టారర్ గురించి మనం చదువుకోవడం తప్ప, చూడడం గగనమైన ఇలాంటి సందర్భంలో ఇద్దరు హీరోలు కలిసి ఓ తెలుగు సినిమాలో నటించడం చరిత్రే. అలా ఈ ‘సీతమ్మ..’ చరిత్ర లిఖించింది. తెలుగు చిత్ర సీమ గతినీ, గమ్యాన్నీ మార్చే సత్తా తనకు వుందని తేల్చి చెప్పింది.

‘సీతమ్మ…’ విజయం తెలుగు సినిమా రూపు రేఖల్ని మార్చినా ఆర్చర్యపోనవసరం లేదు. ఈ సినిమా మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలకు నాంది అవ్వాలని యావత్ చిత్ర పరిశ్రమ కోరుకుంటుంది. “ఈ సినిమా బాగా ఆడితే మరిన్ని మంచి కథలు వస్తాయి. దర్శకులు కొత్త కథలు రాసుకుంటారు” అని వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుల ఆలోచనలకు ఇప్పుడు తలుపులు తెరచుకున్నాయి. ఒకే తెరపై ఇద్దరు హీరోలను చూడలేమేమో అనే సందేహాలు పటాపంచలయిపోయాయి. ఇప్పటికే ‘సీతమ్మ..’ ఫలితం కనిపిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేనన్ని మల్టీ స్టారర్ సినిమాలు తెలుగులో రూపు దిద్దుకుంటున్నాయి. భవిష్యత్తులో మనం కలలో కుడా ఊహించని కలయికలు వచ్చినా రావచ్చు! ఒకవిధంగా చెప్పాంటే 2013 జనవరి 11 పై… తెలుగులో మల్టీ స్టారర్, కుటుంబ కథాచిత్రాల భవిష్యత్తు ఆధారపడి వుంది. ఈ విషయంలో తెలుగు సినిమా ముందడుగు వేయాలంటే ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి. ఈ కలలన్నీ నిజం కావాలని ఆశిద్దాం!!!

Exit mobile version