‘సీతమ్మవాకిట్లో…’ మరో అరుదైన రికార్డ్

SVSC-in-AMC-theatre-in-Times-Square‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తెలుగు తెరపై మళ్లీ మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్‌కు సరికొత్త నిర్వచనంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్, మహేష్‌బాబు కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియో కూడా విజయవంతం కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. మరో రికార్డ్ ఈ సినిమా ఖాతాలో తాజాగా చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్‌ లోని టైమ్స్ స్క్వేర్ ఏఎమ్‌సి థియేటర్స్‌ లో ఈ చిత్రం ప్రదర్శితం కాబోతోంది.

‘టైమ్స్ స్క్వేర్’ అనేది అమెరికాలోనే ఫేమస్ సినిమా థియేటర్ల సముదాయం. హాలీవుడ్ సినిమాలే ఇందులో ప్రదర్శితమవుతుంటాయి. భారతదేశంలో తయారయ్యే సినిమాల్లో అడపాదడపా హిందీ సినిమాలు మాత్రమే అక్కడ విడుదలవుతుంటాయి. ఇక తెలుగు సినిమా లు అక్కడ ప్రదర్శించబడాలంటే కష్టమే! ఇప్పుడు తాజాగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ లోటుని తీర్చేయబోతోంది. ‘సీతమ్మవాకిట్లో…’ చిత్రాన్ని జనవరి 10న ప్రీమియర్ షోతో ‘టైమ్స్ స్క్వేర్’లో విడుదల చేయబోతున్నారు. ఏ దక్షిణ భారత చిత్రం కూడా ఇంత వరకు అక్కడ ప్రదర్శితం కాలేదు. ఆ విధంగా ‘టైమ్స్ స్క్వేర్’లో ప్రదర్శితం కానున్న తొలి దక్షిణభారత చిత్రంగా ‘సీతమ్మ…’ రికార్డ్ సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.