కథా పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తనకు సరిపోయే కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న శర్వానంద్ ‘రాధ’ చిత్ర ప్రమోషన్లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించాడు. కెరియర్ ప్రారంభంలోనే ఉండగా ‘కో అంటే కోటి’ చిత్రాన్ని నిర్మించిన శర్వాకు ఆ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. మంచి కథ ఉండి, ఆకట్టుకునే విషయం ఉన్నా కూడా ఏదో జరిగి ఆ చిత్రం ఫ్లాపయింది. హీరోగా అప్పుడే సెట్ అవుతున్న శర్వాకు చాలా నష్టాలనే తీసుకువచ్చింది. ఇక అప్పటి నుండి మరో సినిమాని ఇప్పట్లో నిర్మించే ఉద్దేశ్యమే లేదు అని శర్వా గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
తాజాగా మీరు మరో చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారంటా! కదా అని అడగగా బాబోయ్… మళ్లీనా, అది ఇప్పుడా ఆ ఆలోచనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. నిర్మాత అంటే చాలా లెక్కలు తెలిసుండాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు అన్ని తెలియాలి, హిట్ అవుతుందా..?? కలెక్షన్లు రాబడుతుందా అని అంచనా వేయగలగాలి, దానికే పూర్తి సమయాన్ని కేటాయించాలి, ఇప్పుడు నాకు అంత సీన్ లేదు, ఇప్పట్లో మరో సినిమాని నిర్మించే ఆలోచనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక వరుసగా తన ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు.