‘సరిలేరు నీకెవ్వరు’ ఓపెనింగ్ హైలైట్స్..

మహేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారిని ఎప్పటికీ మరిచిపోలేను. కచ్చితంగా మంచి హిట్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను. ఈ సినిమాలో విజయశాంతి గారు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సబ్జెక్ట్ నచ్చి చేయడానికి అంగీకరించిన విజయశాంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా, ఆవిడ ఒక ప్రెస్ నోట్ పంపారు. ఈ సందర్భంగా చదివి వినిపిస్తాను’ అని విజయశాంతి పంపిన ప్రెస్ నోట్‌ను అనిల్ రావిపూడి వినిపించారు.

‘సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తెలుగు మొదటి సినిమా ‘కిలాడి కృష్ణ’ సూపర్ స్టార్ కృష్ణ గారితో చేశాను. ఆ తరవాత 180 సినిమాల్లో నటించాను. నా రాజకీయ జీవితంలో 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని విజయశాంతి తన ప్రెస్‌ నోట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్య పాత్ర చేస్తున్నట్లు అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా రష్మిక మందనకు స్వాగతం పలికారు. దేవీశ్రీ ప్రసాద్‌తో తాను ‘F2’ చేశానని, ఇప్పుడు ఇది రెండో సినిమా అని తెలిపారు.

రష్మిక మాట్లాడుతూ..‘మహేశ్ సర్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త టీంతో పనిచేయబోతున్నా. చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుందని కచ్చితంగా చెప్పగలను. ఇప్పుడే సినిమా గురించి అన్నీ చెప్పలేను. చిత్రీకరణ మొదలయ్యాక చెప్పుకోవాల్సినవి చాలా ఉంటాయి. ధన్యవాదాలు’ అని తెలిపింది.

‘మహేశ్‌బాబుతో పాటు ఆయన అభిమానులందరికీ ధన్యవాదాలు. మహేశ్‌ సినిమాల్లో ఊర మాస్‌ పాట ఉండాలని అభిమానులు సోషల్‌మీడియాలో మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. కానీ ఆయన సినిమాల్లో ఇప్పటివరకు అంతటి ఊరమాస్‌ పాటను పెట్టే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెబుతున్నా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కచ్చితంగా మీరు అడిగిన రీతిలో ఓ మాస్‌ పాట ఉండబోతోంది. మహేశ్‌ అభిమానులందరికీ ఇదే నా హామీ’ దేవి శ్రీ తెలిపాడు.

ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ రష్మిక మందన తదితరులు పాల్గొన్నారు.