జైలు కెళ్లే సమయం ఆసన్నమయ్యేకొద్దీ సంజయ్ దత్ మరీ కుమిలిపోతున్నాడు. గురువారం ఏ క్షణంలో అయినా లొంగిపోయేందుకు శారీరకంగా సిద్ధమైపోయాడు సంజూ. కానీ.. మనసే చాలా ఇబ్బంది పెడుతోంది. గడువు దగ్గర పడుతోందని… షూటింగులు, డబ్బింగులూ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగిన సంజూ… కొన్ని రోజులుగా కేవలం ఇంటికే పరిమితమయ్యాడు. సంజూ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని స్నేహితులు, సినిమా వాళ్లు, పరామర్శకులూ పలకరించడం, సానుభూతి కురిపించడం మొదలెట్టారు. రెండు రోజుల నుంచీ అవీ బంద్. ఇంట్లో ఒక్కడే బిక్కు బిక్కుమంటూ కూర్చుంటున్నాడట. భార్య కదిలించినా బోరు మంటున్నాడట. చెట్టంత మనిషి కుదేలైపోయాడు. మున్నాభాయ్ కి కన్నీరే మిగిలింది. ఈరోజు ఆయన ముంబైలోని ప్రత్యేక టాడా న్యాయస్థానంలో లొంగిపోనున్నారు. మళ్లీ సంజూని చూడాలంటే మూడున్నర యేళ్లు ఆగాలి.