మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. చిత్రలహరి చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన మూడు నెలలకు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. నేడు సినిమాను రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా మారుతి అధికారికంగా ప్రకటించాడు.
ఈ చిత్రానికి ఇప్పటికే ‘ప్రతిరోజు పండుగే’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ లక్ష్మినరసింహ స్వామి టెంపుల్ లో ప్రారంభించారు. నేటి ఉదయం నుండి అక్కడ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా మారుతి పేర్కొన్నాడు. ఇటీవలే అక్కడకు చేరుకున్న సాయి ధరమ్ తేజ్ మరియు రాశిఖన్నాలు ఒక సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. నేటి నుండి షూటింగ్ ప్రారంభం అవ్వడంతో వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్‌లు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.