Site icon TeluguMirchi.com

హెచ్‌సీఏ అవార్డ్స్ లో “RRR” సెన్సేషన్ ఏకంగా నాలుగు..


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం RRR. ఈసినిమా రిలీజ్ కోసం దాదాపు నాలుగేళ్లు టైమ్ పట్టింది. ఇక ఈసినిమాలో హీరోలుగా చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం వేరే సినిమాలను కూడా కమిట్ అవ్వకుండా ఈసినిమా కోసమే పనిచేశారు. ఇక ఇప్పుడు వారి కమిట్ మెంట్ కు ఫలితం దక్కుతుంది. గ‌త ఏడాది మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1200 కోట్ల‌ను వ‌సూలు చేసి ఇండియా టాప్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిలో ప‌డింది.

ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది. గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో నాలుగు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. అలాగే స్పాట్ లైట్ అవార్డ్ కూడా RRR కే దక్కింది.

ఇక ఈసందర్భంగా అవార్డ్ ప్రధానోత్సవాల్లో రాజమౌళి మాట్లాడుతూ.. హెచ్సీఏ అవార్డు ప్రకటించిన సభ్యులకు ధన్యవాదాలు. ఎంతో కష్టపడి స్టంట్స్ ను కొరియోగ్రఫీ చేసిన సాలొమన్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులను కంపోజ్ చేసిన జూజీతో పాటు… ఇండియాకు వచ్చి, మా ఆలోచనను అర్థం చేసుకుని, కష్టపడి పని చేసిన ఇతర స్టంట్ మాస్టర్లందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో రెండు, మూడు షాట్స్ లో మాత్రమే డూప్స్ ని వినియోగించాం. మిగిలిన షాట్లన్నీ తారక్, రామ్ చరణ్ స్వయంగా చేశారు. 320 రోజుల పాటు ఈ చిత్రాన్ని షూట్ చేస్తే అందులో ఎక్కువ రోజులు స్టంట్స్ కోసమే పని చేశాం. ఇది కేవలం నాకు, నా సినిమాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. యావత్ భారతదేశ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం అంటూ తెలిపారు.

హాలీవుడ్ సినిమాల‌తో పోటీ ప‌డి స్పాట్ లైట్ అవార్డ్ తో పాటు ఏకంగా నాలుగు కేట‌గిరీల్లో RRR సినిమాకు అవార్డులు రావ‌టంపై ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కులు సంతోషాన్నివ్య‌క్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. ఇకపోతే తారకరత్న మరణించడం వల్ల ఎన్టీఆర్ ఈ అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్లలేకపోయారు.

Exit mobile version