రివ్యూ : ‘యముడికి మొగుడు’

రివ్యూ : ‘యముడికి మొగుడు’

Yamudiki-Mogudu-2012

లాజిక్ లేని కామిక్…. ‘యముడికి మొగుడు’

నటీనటులు : అల్లరి నరేష్, రిచా పనయ్, రమ్యకృష్ణ, శాయాజీ షిండే, సీనియర్ నరేష్ తదితరులు
సంగీతం : కోటి
నిర్మాత : చంటి అడ్డాల
స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సత్తిబాబు

తెలుగు చిత్రసీమలో యముడి కాన్సెప్ట్ అంటే… పిండుకున్న వాళ్ళకు పిండుకున్నంత! సరైన సన్నివేశాలు పడితే… అది కామెడీ పండగే. వినోదాత్మక పాత్రలకు టైమింగ్ చాలా అవసరం. అందులో ఆరి తేరి పోయిన నరేష్ లాంటివాడికి యమ కధ పడితే…? ఇంకెంత వినోదం ఆశిస్తారో.. ! యమ లోకాన్ని నవ్వుల సునామీలో కొట్టుకు పోయేలా చేస్తాడని అనుకుంటారు. అందులోనూ ‘సుడిగాడు’ సినిమాతో అల్లరోడు మంచి జోరుమీద వున్నాడు. అందుకే ‘యముడికి మొగుడు’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి… నరేష్ తన జోరు కొనసాగించాడా? యమ ఫార్ములా అతనికి ఎంతవరకూ కలిసొచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.

yamudiki-mogudu-బ్రహ్మ (చలపతి రావు) ఓ రొమాంటిక్ మూడ్లో ఉండి చేసిన తప్పుకు… భూలోకంలో తలరాతలేని శిశువు (నరేష్) పుట్టేస్తాడు. తల రాత లేకపోవడం వల్ల… ఆ నరుడు ఏమనుకుంటే అది జరిగిపోతుందన్న మాట. కానీ ఆ శక్తి వుందన్న సంగతి అతనికి తెలీదు. తెలిస్తే చాలా అరాచకాలు జరుగుతాయి. దాంతో దేవతలంతా భయ కంపితులవుతారు. నరేష్ ని పుట్టించింది బ్రహ్మ అయినా చంపే అధికారం యముడికి (షాయాజీ షిండే) మాత్రమే వుంది. దాంతో “ఎలాగైనా సరే తమరే మమ్ములను కాపాడాలి” అని దేవతలంతా యముడి దగ్గర మొరపెట్టుకుంటారు. అయినా యముడికి చీమ కుట్టినట్టు కూడా వుండదు. యముడి అహంకారం చూసి నారదుడికి (సీనియర్ నరేష్) ఒళ్ళు మండిపోతుంది. యముడి కూతురు (రిచా పనయ్)ని భూలోకం పంపించి.. నరేష్ పై ప్రేమ పుట్టేలా చేస్తాడు. ‘మొగుడా.. మొగుడా’ అంటూ యమ కూతురు భూలోకంలో నరేష్ వెంట పడుతుంది. నరేష్ ఇంట్లో పని మనిషిగా చేరుతుంది. ఆ అమ్మాయి మంచి తనం చూసి నరేష్ కుడా చలించిపోతాడు. భార్యగా స్వీకరిస్తాడు. అదే సమయంలో యముడు తన కూతురిని తీసుకెళ్ళడానికి భూమ్మీదకు వస్తాడు. దున్నపోతు తోక పట్టుకుని నరేష్ కుడా యమలోకం వెళ్ళిపోతాడు. అక్కడ యముడితో పోరాడి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? యమలోకాన్ని ఎలా ఆటాడించాడు? అనేదే ‘యముడికి మొగుడు’ ఇతివృత్తం.

yamudiki_mogudu_telugu_movie_‘యమ గోల’, ‘యమ లీల’, ‘యముడికి మొగుడు’, ‘యమ దొంగ’… ఇలా యముడిని ఎలా వాడుకోవాలో అలా వాడేసుకున్నారు మన తెలుగు దర్శకులు. ఇప్పుడు ఈ ఫార్ములా ఎవరు ముట్టుకున్నా ఆ సినిమాలను స్పూర్తిగా తీసుకోవాల్సిందే. కొన్ని సన్నివేశాలు డిట్టో అలాగే వున్నా అది వీరి తప్పు కాదు. గత సినిమాల ప్రభావం అలాంటిది. దాదాపుగా పాత సినిమాల ఛాయా లేకుండా యముడి కధను కొత్తగా చూపించే అవకాశం సత్తిబాబుకి దక్కింది. ఎందుకంటే… ఇదో తమాషా కధ. దేవతలకు ఉండవలసిన శక్తులతో ఓ మనిషి పొరపాటున పుట్టేయడం కాస్త కొత్తగానే వుంది. దానితో పాటు యమ సినిమాల్లో వుండే ఫార్ములా ఇందులోనూ పుష్కలంగా వుంది. అయితే… కొత్త పాయింట్ తో కొత్త దారిలో వెళ్ళకుండా… అదే పాత పద్ధతిని అనుసరించారు. యమ కూతురు భూమ్మీదకు వచ్చాక సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో సాగుతుంది. అందులో శ్రీదేవి ‘నరుడా’ అంటే, ఇందులో యమ కూతురు… ‘మొగుడా, మొగుడా’ అని వెంట పడుతుంది. యమలీల, యమదొంగ… సినిమాలను గుర్తుకు తెచ్చే సన్నివేశాలు బోలెడన్ని. నరేష్ ఏమనుకుంటే అది జరిగిపోతుంది అనేది ఈ సినిమాలో అసలు పాయింట్. దానికి ప్రాధాన్యం ఎవ్వలేదు. నిజానికి నరేష్ ఈ సినిమాలో చాలా అనుకుంటాడు. అవేవీ ఎందుకు జరగలేదు? అన్ని శక్తులు వుంటే ఇంటర్ అన్ని సార్లు ఎలా తప్పుతాడు.

yamudiki_moguduయమ కధ అంటే… నరుడికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, యమ పాత్రధారికీ అంతే వుంటుంది. యమ ఫార్ములా హిట్ అయ్యిందే అక్కడ! యస్వీఆర్, కైకాల సత్యనారాయణ లాంటి దిగ్గజాలు ‘యముండా’ అని పలికితే థియేటర్ లో కూర్చున్న ఆడియన్ గుండె దడదడ లాడుతుంది. అయితే ఇక్కడ షాయాజీ షిండే యముడిగా తేలిపోయాడు. రాయల సీమ ఫ్యాక్ష్కనిస్ట్ కి.. యముడి గెటప్ వేసినట్టు వుంది. కళ్ళల్లో రౌద్రం కాస్త కూడా పలకలేదు. దేవతలతో ఇంగ్లీష్ అడ్డదిడ్డంగా పలికించి… కామెడీ చేసారు. చిత్రగుప్తుడు.. అస్తమానం యముడిని ‘మీరిక మూసుకొనుము’ అంటుంటాడు. ఆ సమయంలో సెన్సార్ ఏమి మూసుకుందో..? సంభాషణల్లో కొన్ని బూతులు అలా వస్తూ… అలా పోతూ వుంటాయి. ‘మొ…. గుడు’ అని పదాన్ని విడదీసి పలికితే ఎంత చండాలంగా వుందో ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సెటైర్ లు బాగానే పేలాయి. ‘అసలే వింటర్.. ఆపై సెంటర్’, ‘దీని పిచ్చి, హై పిచ్చిలో వుంది’, ‘ఆత్మలతో ఐ.పి.యల్ ఆడేస్తున్నారు, ‘భూలోకం అనే నాటక రంగం లో ఎంట్రీ ఎగ్జిట్ తప్ప రిహార్సల్స్ వుండవు’… మచ్చుకు కొన్ని. నరేష్ నటన డిటో బాగానే వుంది. ఎక్కడా కష్టపడినట్టు అనిపించదు. రిచా కి ఇదే తొలి సినిమా. చూడడానికి అందంగానే వుంది. కెమెరా కాన్సంట్రేషన్ అంతా ఆమె నాభి దగ్గరే వుంది. ‘అత్తో అత్తమ్మ కూతురో’ పాటలో రిచా కంటే రమ్యకృష్ణ ఎక్కువ స్టెప్పులు వేసింది. రొయ్యల నాయుడు (భరణి) పాత్ర సినిమాలో శుద్ధ దండగ.

allari-nareshఈ సినిమాలో ప్రధానమైన లాజిక్ మిస్ అయ్యింది. పైగా కాస్త కూడా సీరియస్ నెస్ వుండదు. తెరపై ఓ డ్రామా చూస్తున్నట్టు వుంటుంది. కొన్ని సంభాషణలు, సన్నివేశాలు వినోదం పంచుతాయి. యమలోకంలో క్రికెట్ మ్యాచ్ అనే కాన్సెప్ట్ బాగుంది. సెట్స్ భారీగానే వాడుకున్నారు. కోటి సంగీతం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన పాత పాట అత్తో అత్తమ్మ కి కుడా న్యాయం చేయలేక పోయాడు. లాజిక్కులు వెతుక్కోకుండా కేవలం నవ్వుకోవడానికి వెళ్తే… కాసేపు టైం పాస్ అయిపోతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Review